ప్రయాణికుల ‘రూట్’లో...
30 మార్గాల్లో 549 బస్సుల నిర్వహణలో మార్పులు
డిపోల మధ్య సమన్వయం, బస్సుల బంచింగ్ నియంత్రణ
సమయ పాలనలో మార్పులతో సత్ఫలితాలు
సాక్షి, సిటీబ్యూరో: ఏబస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రయాణికులంతా ఒకవైపు పడిగాపులు కాస్తుంటే బస్సులు మరో రూట్‌లో పరుగులు పెడుతుంటాయి. నాలుగైదు డిపోల బస్సులు ఒకే రూట్‌లో... ఒకే సమయంలో బయలుదేరుతాయి. దీంతో బస్సు వెనుక బస్సు బంచింగ్. వె రసి ప్రయాణికుల నిరాదరణ. ఇలాంటి సంస్థాగత వైఫల్యాలను అధిగమించేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ చేపట్టిన రూట్‌ల స్థిరీకరణ సత్ఫలితాలనిస్తోంది. ఇటీవల 30 రూట్‌లలో చేపట్టిన స్థిరీకరణ చర్యలతో ఆ ప్రాంతంలో ఆక్యుపెన్సీ 2 శాతం పెరిగినట్లు అధికారుల అంచనా. గ్రేటర్‌లోని సుమారు 1,050 రూట్‌లలో 3,850 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. డిపోల మధ్య సమన్వయ లోపంతో బస్సుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. దీనిపై సమగ్రఅధ్యయనం చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ అధికారులు అన్ని ప్రధాన మార్గాల్లో రూట్‌ల స్థిరీకరణకు చర్యలు చేపట్టారు. దీంతో కొన్ని మార్గాల్లో ట్రిప్పుల సంఖ్య పెరిగింది. మరి కొన్ని రూట్‌లలో కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొన్ని రూట్‌లను పొడిగించారు. మొత్తంగా 30 రూట్‌లలో 549 బస్సుల నిర్వహణలో చేసిన మార్పులు, చేర్పులతో ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం.
పెరిగిన ట్రిప్పులు
రూట్‌ల స్థిరీకరణకు చేపట్టిన చర్యలతో కొన్ని మార్గాల్లో ట్రిప్పుల సంఖ్య పెరిగింది. ఉదాహరణకు జయపురి కాలనీ-అఫ్జల్‌గంజ్ (రూట్ 72జె) మార్గంలో 8 బస్సులు నిత్యం 60 ట్రిప్పులు తిరిగేవి. ఈ రూట్‌లో బస్సులు నడిపే వివిధ డిపోల మధ్య సమన్వయం వల్ల మరిన్ని బస్సులు అదనంగా నడిపేందుకు అవకాశం లభించింది. దాంతో ట్రిప్పుల సంఖ్య 70కి పెరిగింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 9.08 గంటల వరకు ప్రతి 12 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు.
సీతాఫల్‌మండి, జామై ఉస్మానియా, రాంనగర్ గుండు, నారాయణగూడ, కాచిగూడ క్రాస్‌రోడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, పురానాఫూల్ మీదుగా జియాగూడకు వెళ్లే 86జె రూట్‌లో ప్రస్తుతం 16 బస్సులు తిరుగుతున్నాయి. వీటి నిర్వహణ లో వైఫల్యాలను అధిగమించడంతో ట్రిప్పుల సంఖ్య 21 నుంచి 45కు పెరిగింది. ఉదయం 6.45 నుంచి రాత్రి 8.04 గంటల వరకు ఈ రూట్‌లో బస్సులు తిరుగుతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
వనస్థలిపురం, ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, హబ్సిగూడ, తార్నాక మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే హయత్ నగర్-సికింద్రాబాద్ (290) రూట్‌లో 33 బస్సు లు తిరుగుతున్నాయి. రూట్‌ల స్థిరీకరణతో ట్రిప్పుల సంఖ్య పెరిగింది.ఉదయం 4.45 నుంచి రాత్రి 10.01 గంటల వరకు బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
8 రూట్‌లలో కొత్త బస్సులు...
పటాన్‌చెరు-శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మేడ్చెల్-వీబీఐటీ, జగద్గిరిగుట్ట-విప్రో తదితర 8 రూట్‌లలో 56 కొత్త సర్వీసుల ను ప్రవేశపెట్టారు.
మరో 24 రూట్‌లలో బస్సులను పొడిగించారు. ఉదాహరణకు అల్వాల్-కోఠి మధ్య నడిచే బస్సులను అటు సుచిత్ర వరకు ఇటు అఫ్జల్‌గంజ్ వరకు పొడిగించారు.
సికింద్రాబాద్-జూపార్కు మధ్య నడిచే 7జెడ్ బస్సులను ఆరాంఘర్ వరకు పొడిగించారు. ఇలా వివిధ రూట్‌లలో పొడిగింపుతో ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు పెరిగింది.