
చలామణీలో లేని టర్కీ కరెన్సీ పట్టివేత
చలామణిలో లేని టర్కీ కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు.
♦ రూ. 220 కోట్ల విలువైన 96 టర్కీ నోట్ల స్వాధీనం
♦ నోటు విలువ రూ. 10 లక్షలు ( టర్కీ కరెన్సీలో)
♦ ఇద్దరు నిందితుల అరెస్టు
ముషీరాబాద్: చలామణిలో లేని టర్కీ కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. వారి వద్ద నుంచి 96 టర్కీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ఇండియున్ కరెన్సీలో దాదాపు రూ. 220 కోట్లు. శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, ఇన్స్‌పెక్టర్ బిట్టు మోహన్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన రత్నకుమార్ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతనికి గుంటూరుకు చెందిన రామకృష్ణ స్నేహితుడు. వారికి గతంలో రొయ్యల వ్యాపారం చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది.
ఆ వ్యాపారం అంతంత మాత్రంగా ఉండగంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వ్యక్తి నుంచి 96 టర్కీ కరెన్సీ నోట్లను చెలామణి చేసేందుకు తీసుకున్నారు. ఒక్కో నోటు టర్కీ కరెన్సీలో పది లక్షలు కాగా, దానిని లక్ష రూపాయలకే ఇస్తామని చెబుతూ రాంనగర్‌లోని శ్రీనివాస వస్త్ర దుకాణానికి వచ్చిన విశ్వనాథ్ అనే వ్యక్తికి వల వేశారు. వీరి మాటలు నమ్మిన శ్రీనివాస్ ఒక నోటును తీసుకుని రూ.20 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చిడు. అనంతరం అతను కరెన్సీకి సంబందించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో గాలించగా, సదరు కరెన్సీని 2005లోనే టర్కీ ప్రభుత్వం నిషేదించినట్లు గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించిన అతను ముషీరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిగతా డబ్బు చెల్లిస్తానని శ్రీనివాస వస్త్రదుకాణం వద్దకు రావాలని విశ్వనాథ్‌తో ఫోన్ చేయించారు. రత్న కుమార్, రామకృష్ణ విశ్వనాథ్‌తో బేరసారాలు సాగిస్తుండగా, అక్కడే మాటు వేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 96 చెలామణిలో లేని టర్కీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా నకిలీ కరెన్సీ ముఠాను పట్టుకున్న కానిస్టేబుల్ పి.నాగేశ్వర్ రావు, జి.మల్లేష్, ఎ.బాలరాజులకు నగదు రివార్డులు అందజేశారు.