
బుల్లితెర నటి దీప్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మి(30) అనుమానాస్పదంగా మృతి చెందింది. సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అప్పలనాయుడు కుమార్తె బిడగం రామలక్ష్మి సినిమా అవకాశాల కోసం 10 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది. తన పేరును దీప్తిగా మార్చుకొని పలు సీరియల్స్‌లో నటిస్తోంది.
ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మి వంటి సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. తాళి సీరియల్‌కు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అలాగే, పెళ్లమా ప్రియురాలా, కొత్త ఒక వింత, జోగిని సినిమాల్లో నటించింది. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పెయింటర్ శంకర్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తనను వేధిస్తున్నాడంటూ దీప్తి భర్త శంకర్‌పై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సీరియల్స్ డెరైక్టర్ రమేశ్‌కుమార్‌తో ఆమె సహ జీవనం చేస్తోంది. ఈ విషయం రమేశ్ భార్యకు తెలియడంతో దీప్తితో ఆమె గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో రమేశ్ తన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
కాగా, శుక్రవారం రాత్రి 9 గంటలకు దీప్తిని ఇంటివద్ద వదిలి వెళ్లిన రమేశ్.. ఆ తర్వాత ఆమె చనిపోయిందంటూ సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హరిశ్చంద్రారెడ్డి, ఎస్‌ఐ సైదులు ఘటనాస్థలానికి చేరుకొని దీప్తి లాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌ను విచారించగా రాత్రి 11 సమయంలో ఫ్లాట్‌కు వచ్చానని, తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా దీప్తి చీరతో ఉరేసుకోవడం చూశానని, వద్దని అరిచానని పోలీసులకు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దీప్తిది హత్యా, ఆత్మహత్యా తేలుతుందని సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.