
విహారంలో విషాదం
సాగర్‌లో రెండు బోట్లు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో విహరిద్దామని వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు మరణించింది. రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి కథనం ప్రకారం ఒడిశాకు చెందిన భక్తవార్ రాణా (22) హైటెక్ సిటీలోని ‘విప్రో’లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మణికొండలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆమె శనివారం బెంగుళూరు నుంచి వచ్చిన ఇద్దరు స్నేహితులు, ఇక్కడే పనిచేసే మరో ఇద్దరితో కలిసి సాగర్ విహారానికని వచ్చారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో అందరూ స్పీడ్‌బోట్‌లో సాగర్‌లో విహరిస్తున్నారు.
కొద్దిసేపు తిరిగిన తర్వాత స్నేహితులు అక్కడే ఉన్న ఓ మెకనైజ్డ్ బోట్ చుట్టూ తిరగాలని డ్రైవర్‌ను కోరారు. దీంతో డ్రైవర్ మెకనైజ్డ్ బోటు చుట్టూ తిరుగుతుండగా ప్రమాదవశాత్తు రెండు బోట్లు ఢీకొన్నాయి. అదే సమయంలో స్పీడ్‌బోట్‌లో వెనుక కూర్చున్న భక్తవార్ రాణా గొంతుకు మెకనైజ్డ్ బోట్ అంచు తగిలింది. దీంతో గొంతుకు తీవ్రగాయమై బోటులోనే పడిపోయింది. వెంటనే ఆమెను మెడిసిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించింది. రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.