నాగోలు(హైదరాబాద్): కాస్త ఖర్చు తగ్గుతుందని ఆశ పడితే...మొదటికే మోసం వచ్చింది. కారులో ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకోగా.. అదను చూసి వారు కారుతో ఉడాయించారు. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్‌కు చెందిన సందుల కృష్ణకు (నంబర్ ఏపీ13ఏఎఫ్ 8828) కారుంది. అందులో తన స్నేహితుడు బాలరాజుతో విజయవాడ వెళ్లారు. తిరిగి వస్తుండగా విజయవాడ బస్టాండ్ సమీపంలో ఆగి ఉండగా ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్‌కు వస్తున్నామని అడిగారు. ఖాళీగా ఎందుకు వెళ్లటం.. వారిని తీసుకెళ్తే టోల్‌గేటు డబ్బులైనా వస్తాయని ఆశపడిన కృష్ణ వారిని ఎక్కించుకున్నాడు. ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బ్రాడ్‌ల్యాండ్ హోటల్ వద్ద కారు ఆపారు. కృష్ణ నీరు తాగేందుకు, బాలరాజు బాత్‌రూంకు వెళ్లాడు. ఇదే అదనుగా కారులో ఉన్న ఇద్దరు కారుతో ఉడాయించారు. దీంతో బాధితుడు వెంటనే ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.