ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ఉప్పల్: ఇద్దరూ స్నేహితులు. చదువు అంటే ప్రాణం. పేద కుటుంబాలకు చెందిన వీరు తమ చదువుల వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదని భావించారు. ఉదయాన్నే ఇంటింటికీ పాలప్యాకెట్లు వేస్తూ.. వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజు కట్టుకుంటున్నారు. ఇద్దరినీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం... ఉప్పల్ గణేష్‌నగర్ నివాసి మల్లేష్ కార్పెంటర్. ఇతని కుమారుడు శ్రావణ్(17) ఇంటర్ చదువుతున్నాడు. ఉప్పల్ సెవన్ హిల్స్‌కాలనీకి చెందిన రవూఫ్ కుమారుడు నూర్ అహ్మద్(18) శ్రావణ్‌కు స్నేహితుడు.
ఇద్దరూ ప్రతీ రోజు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు వేస్తూ వచ్చిన డబ్బులో కొంత తమ చదువుకు ఖర్చు చేస్తూ మిగతాది కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులకు ఇస్తున్నారు. రోజూ మాదిరి గానే పాలు వేసేందుకు ఉప్పల్ నుంచి ద్విచక్రవాహనం (ఏపీ 29-సీఏ-9561)పై మేడిపల్లికి బయలుదేరారు. నూర్ అహ్మ ద్ బైక్‌ను నడుపుతున్నాడు. ఉప్పల్ నల్లచెరువు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన నూర్‌అహ్మద్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదువు కోసం పాల ప్యాకెట్లు వేస్తూ..
Published Sat, Feb 13 2016 12:15 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement