
పురుషోత్తపట్నం ఎందుకు కడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసి నిన్న పట్టిసీమ అన్న ప్రభుత్వం ఇప్పుడు సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ఎందుకు కడుతున్నారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ కడతారా...కట్టరా అనే అనుమానాలు వస్తున్నాయని ఆయన అన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా, మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అన్నారు. రాష్ట్రం ఏర్పడి రెండేల్లు గడిచినా కూడా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు ఆపడం లేదన్నారు. జీడీపీ 12.26 శాతానికి పెరిగిందని చంద్రబాబు చెబుతున్నా రెవెన్యూ మాత్రం తగ్గిపోతోందన్నారు.