రికార్డు సృష్టించిన హెచ్సీయూ విద్యార్థిని
హైదరాబాద్: ఓ పక్క రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూవోహెచ్) వివాదాలకు వేదికగా మారి చర్చనీయాంశంకాగా.. అదే వర్సిటీ, అందులోని విద్యార్థులు విద్యాపరంగా రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల సరసన చేరిన ఈ వర్సిటీ అంతే స్థాయిలో ఉత్తమ విద్యార్థులను కూడా అందించగలదని నిరూపించింది.
అవును.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీ ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సాధించి రికార్డు సృష్టించింది. స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆమె 200 మార్కులకుగాను 158 మార్కులు సాధించింది. వచ్చే జూలై నెలలో ఆమె టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో పీహెచ్డీ ప్రవేశం పొందనుంది.
ముందునుంచే పుస్తకాలంటే ఎంతో మక్కువ చూపే ప్రసూన ప్రతి అకాడమిక్ ఇయర్లో రాణించేందుకు తోటి విద్యార్థులతో మమేకమవుతూ ప్రణాళిక బద్దంగా చదివినట్లు తెలిపింది. తన డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, వర్సిటీ అందించిన సహకారం ఎంతో గొప్పదని కొనియాడింది. వర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను ఈ వర్సిటీని, ఈ కోర్సును ఎంచుకున్నట్లు వివరించింది.