కష్టార్జితంపై బ్యాంకుల పెత్తనమా?
- పీసీసీ విస్తృత స్థాయి భేటీలో ఉత్తమ్
- మోదీ, కేసీఆర్‌లను నిలదీయాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బును తీసుకోనీయకుండా నోట్ల రద్దు పేరిట బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ పెత్తనమేమిటని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశం మంగళ వారం గాంధీభవన్‌లో ఆయన అధ్యక్షతన జరిగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, విపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్య నారాయణ, బలరాంనాయక్‌తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచితంగా, నియంతృ త్వంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలపై పోరాడాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన 9 డిమాండ్లతో పోరాటాలు చేయాలన్నారు. ‘‘బ్యాంకుల్లోని డబ్బును తీసుకోవడానికి పరిమితులు, నిబంధనలు సడలించాలి. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల చొప్పున కేంద్రం జమ చేయాలి. ఉపాధి హామీ పని దినాలను పెంచాలి. వేతనాలను రెట్టింపు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పేదల కష్టాలను, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, ఢిల్లీ వెళ్లి మోదీని కలవగానే నోట్ల రద్దును సమర్థించారని విమర్శించారు. నోట్ల రద్దును ముందుగా వ్యతిరేకించి ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘నోట్ల రద్దు సమస్యలపై మోదీని, కేసీఆర్‌ను నిలదీయండి. 19న అన్ని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయండి. 20న ఆర్‌బీఐ ఎదుట జరిగే ధర్నాలో పాల్గొనండి’’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనేతలంతా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు.
ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరు
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామన్న టీఆర్‌ఎస్ ఎన్నికల హామీ అమలుకు పోరాడాలని పార్టీ నేతలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. ముస్లిం రిజర్వేషన్లపై మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మంగళవారం గాంధీభవన్‌లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్ల అమలుకుచర్యలు తీసుకుందన్నారు. రిజర్వేషన్లను అమలుచేసేదాకా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.