ఉత్తమ్ x జానా
తెలంగాణ కాంగ్రెస్ సారథ్య పదవి చేజిక్కించుకునే దిశగా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి పావులు కదుపుతున్నారు.
పీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ‘చీఫ్’గా ఉండటమే ‘ముఖ్య’0
- సన్నిహితులతో జానా వ్యాఖ్యలు.. ఢిల్లీ పెద్దలతో జోరుగా భేటీలు
- జానా ఎత్తులకు ఉత్తమ్ పైఎత్తులు.. శ్రేణులు, నేతలతో మంతనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సారథ్య పదవి చేజిక్కించుకునే దిశగా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తన మనోగతాన్ని వెల్లడించినట్టు సన్నిహితులు, ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు కూడా లేనందున, పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటేనే అనంతరం ‘ముఖ్య’పదవి చేజిక్కుతుందన్న యోచనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జానాకు దీటుగా పై ఎత్తులు వేస్తున్నట్టు చెబుతున్నారు. తన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లేలా ఆయనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర నేతల తెర వెనక పోరు రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయంగా, ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు
సీఎల్పీ నేతగా కంటే పీసీసీ సారథిగా ఉంటేనే పార్టీపై పట్టు చిక్కుతుందన్నది జానా అభిమతంగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ పెద్దలతో ఆయన ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారని తెలిసింది. మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతతో కలిసి ఇప్పటికే అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ తదితరులతో జానా సమావేశమైనట్టు సమాచారం. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా జానా కలిశారని ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా అన్ని కీలక శాఖలకూ జానా మంత్రిగా పని చేయడం తెలిసిందే. కాబట్టి సీఎం మినహా మరే పదవైనా తనకు చిన్నదేననే భావనలో ఆయన ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు కూడా. అందుకే ఇప్పుడే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి అధికారంలోకి తేగలిగితే తన చిరకాల వాంఛ నెరవేరుతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
ఉత్తమ్ పై ఎత్తులు
మరోవైపు జానా వ్యూహాలను పసిగట్టిన ఉత్తమ్, ప్రతి వ్యూహాల్లో తలమునకలుగా ఉన్నారు. పార్టీపై క్రమంగా పట్టును పెంచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ప్రభావం చూపగలిగే ముఖ్య నేతలతో ఉత్తమ్‌వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారి విషయంలోనూ కాఠిన్యానికి పోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు తెర తీశారు. రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ కార్యక్రమాలు పెరిగాయనే సంకేతాన్ని పీసీసీ శ్రేణులకు పంపి వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా సభలు తదితరాల్లో విరివిగా పాల్గొంటున్నారు. మరోవైపు ఢిల్లీలో తనకున్న పరిచయాలు, సన్నిహిత సంబంధాలను కాపాడుకుంటూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌లను మెప్పిస్తూ సాగే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. ‘‘ఈ ఎత్తుగడల్లో ఉత్తమ్ ఇప్పటికే ముందున్నారు.
ఇటీవలి సంగారెడ్డి సభలో రాహుల్ కూడా ‘ఉత్తమ్ నాయకత్వంలో గ్రామగ్రామానికి వెళ్లండి’అని తన ప్రసంగంలో శ్రేణులకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. తద్వారా రాష్ట్రం లో ఆయన నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు పార్టీ సిద్ధమవా లనే సందేశాన్ని రాహుల్ నోటే అందరికీ ఇప్పించినట్టయింది’’అని పీసీసీ సీనియర్లు కొందరు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ఉత్తమ్‌ను తమకు, పార్టీకి అత్యంత విశ్వసనీయ, నమ్మకమైన వ్యక్తిగా గాంధీ కుటుంబం కూడా భావిస్తోందని ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధమున్న నాయకుడొకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జానా ఎత్తుగడలెలా ఉంటాయోనని పీసీసీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.