సాక్షి, సిటీబ్యూరో : అక్రమార్జనే లక్ష్యంగా మోటారు వాహన తనిఖీ అధికారులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఫిట్‌నెస్ పరీక్షల్లో నూటికీ 80 శాతం బోగస్ తనిఖీలతో రోడ్డెక్కుతున్నాయి. వాహనాల కండీషన్, నాణ్యతలపై ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు నిర్వహించకుండా అధికారుల జేబులో డబ్బులు పడితే చాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు ఇచ్చేస్తారు. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి రవాణా వాహనాలన్నింటికి ఏడాదికోసారి ఆర్టీఏ తనిఖీలు తప్పనిసరి.
ఆ వాహనాల పనితీరు సక్రమంగా ఉంటేనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతించాలి. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా, నామమాత్రపు తనిఖీలు నిర్వహించి బ్రోకర్లు ఇచ్చే మామూళ్ల మాయలో పడి రోడ్డు భద్రతను విస్మరిస్తున్నారు. బస్సులోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే ఇవ్వాల్సిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లను రవాణా అధికారులు దళారుల చేతుల మీదుగా వాహనదారులకు విక్రయించేస్తున్నారు.
ఇందుకోసం ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి వాహనాలను రూ.1000 నుంచి రూ.1500 చొప్పున, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులకు రూ.5000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఏ విధమైన తనిఖీలు లేకుండా, భద్రతా నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే వాహనాలు ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి.
నిలువు దోపిడీ
సాధారణంగా లర్నింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల చిరునామా బదిలీ, యాజమాన్య బదిలీ వంటి సేవల కోసం వాహన వినియోగదారులు రవాణా కార్యాలయాలను సంప్రదిస్తారు. రవాణా వాహనాలకు సంబంధించిన పన్నులు, పర్మిట్లు, జరిమానాలు వంటి కార్యక లాపాలు మినహాయించి రవాణాశాఖ నిర్దేశించిన అన్నిరకాల పౌరసేవలపైన ప్రభుత్వం విధించిన ఫీజు సాధారణంగా రూ.వంద నుంచి రూ. 600 వరకు ఉంటుంది. కానీ వాహనదారులు, అధికారులకు నడుమ మధ్యవర్తులుగా వ్యవహరించే దళారులు ఈ ఫీజులకు నాలుగు రెట్లు చొప్పున పెంచేసి వాహనదారులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వచ్చిన అక్రమార్జనలో సింహభాగం అధికారుల ఖాతాల్లో జమ అవుతుందనేది అక్షర సత్యం. మిగతా సొమ్ము దళారుల జేబుల్లోకి వెళుతుంది.
కొరవడిన పర్యవేక్షణ
రవాణా శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా వాహనదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కింది నుంచి పై స్థాయి వరకు వసూల్ రాజాల స్వైరవిహారం, ఆర్టీఏ అధికారుల పనితీరు స్పష్టంగా తెలిసిన ప్పటికీ ఉన్నతాధికారులు దళారీ వ్యవస్థను నిరోధించకపోవడం గమనార్హం.
జరుగుతున్నదిదీ..
వాహన వినియోగదారులు ప్రాథమికంగా తీసుకొనే లర్నింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.90. ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకొని, సమీప ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించి నేరుగా పరీక్షకు హాజరు కావొచ్చు. కానీ ఇలా వచ్చేవారిని సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులు నిరుత్సాహపరుస్తారు. టెస్ట్‌లో ఫెయిల్ చేస్తారు. ఆ విషయం ముందే తెలుసు కాబట్టి వినియోగదారులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే వారి నుంచి లర్నింగ్ లెసైన్స్ కోసం రూ. 500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు.
డ్రైవింగ్ లెసైన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు రూ. 550 మాత్రమే. కానీ దళారుల ద్వారా ఆర్టీఏ వసూలు చేస్తున్న మొత్తం రూ.1500. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు ఇచ్చే తాత్కాలిక లర్నింగ్ లెసైన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ రెండింటి కోసం వచ్చే వారి నుంచి రూ. 3000 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తారు. శాస్త్రీయమైన శిక్షణ లేకుండా డబ్బులు ఇచ్చి డ్రైవింగ్ లెసైన్స్ పొందే డ్రైవర్లు రవాణా వాహనాలను ఎలా నడుపుతారో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వాహనాల రిజిస్ట్రేషన్‌లు, పర్మిట్లు, తదితర కార్యకలాపాలపైనా ఇదే స్థాయిలో కాసుల పంట పండించుకుంటున్నారు.
ప్రతి పనికిసెప ‘రేటు’
Published Fri, Nov 1 2013 4:01 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement