
రోహిత్ వర్ధంతిని అడ్డుకోవద్దు
వేముల రోహిత్ తల్లి రాధిక
విజయవాడ : గతేడాది ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ వర్ధంతిని అడ్డుకోవద్దని అతని తల్లి రాధిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఈ నెల 17న రోహిత్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యార్థి నేతలకు అధికారులు అనుమతించడం లేదన్నారు. రోహిత్ మృతి చెంది ఏడాది గడిచినా నేటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రోహిత్ కులంపై లేనిపోని ప్రచారం చేస్తూ కేసును తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.
రోహిత్ మృతికి కారకులైన వారిపై నేటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై కేసు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. రోహిత్ వర్థంతి కార్యక్రమానికి విద్యార్థులు తరలి రావాలని కోరారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. రోహిత్ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో సెంట్రల్ వర్సిటీ వీసీ అప్పారావుకు అవార్డు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీకి అవార్డు ఇవ్వటం విద్యావ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు.
‘రోహిత్’ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం సామాజిక న్యాయ దినాన్ని పాటిం చనున్నట్లు వారు ప్రకటించారు.