హైదరాబాద్: డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఆదివారం ఉదయం నిర్వహించిన యాంటి డ్రగ్స్ వాక్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రచారం చేయాలని అన్నారు. మత్తులో కొందరు తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించి యువతను చైతన్యవంతం చేయాలని కోరారు. శరీరం, మనస్సు, మేధస్సు, సృజనాత్మకతను ఛిద్రం చేస్తుందని గుర్తించాలన్నారు. సినిమా జనాలను ఆలోచింపచేయగలదని, సినిమాల ద్వారా ప్రజలపై మంచి ముద్ర వేయాలని విజ్ఞప్తి చేయాలి. సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చంద్రవదన్, అకుల్ సబర్వాల్, సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని జెండా ఊపి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. హైదరాబాద్ నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.