గాత్రదాత.. సుఖీభవ
సిటీలోని డబ్బింగ్ స్టూడియోలు స్టార్స్‌తో కళకళలాడుతున్నాయి.
పెద్ద హీరోలు, ఎంతో బిజీగా ఉండే స్టార్స్ సైతం డబ్బింగ్ చెప్పేందుకు సరదా పడుతుండడమే దీనికి కారణం.
టాలీవుడ్‌లో కొత్తగా వేళ్లూనుకుంటున్న ఈ ట్రెండ్ ఓవైపు డబ్బింగ్ ఆర్ట్‌కు స్టార్ హోదా ఇస్తూనే మరోవైపు ఇతర భాషల హీరోలకు గాత్రదాతల కొరతను తీరుస్తోంది.
- శిరీష చల్లపల్లి
టాలీవుడ్ సినిమాలతో వచ్చే క్రేజ్ అంత ఇంత కాదు. అందుకే భాషా ప్రావీణ్యం లేకపోయిన ఇతర భాష హీరోలు సైతం తెలుగులో నటించాలని ఇష్టపడుతుంటారు. లేదా కనీసం తమ సినిమాలు తెలుగులో అనువాదం కావాలని ఆశిస్తుంటారు. అన్యభాషా చిత్రాలు తెలుగులోకి అనువాదమైనప్పుడు ఆ హీరో ఆకారాన్ని, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి సరిపడే వాయిస్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అతి కష్టం మీద వెతికి పట్టుకుంటుంటారు డెరైక్టర్లు.
ఫుల్ హ్యాపీ
‘ప్రేమలీల’ సినిమా కోసం సల్మాన్‌ఖాన్‌కి డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు, నా వాయిస్ ఆయన పర్సనాలిటీకి , పాత్రకు హైలైట్ అవుతుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఒప్పేసుకున్నాను. నా మీద నమ్మకముంచి, ఇలాంటి ఒక ప్రయోగం నాతో చేయించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది.
- రామ్‌చరణ్ (ట్వీటర్ ద్వారా)
అన్ని కళల్లోనూ ప్రూవ్ చేసుకోవాలి
సైజ్ జీరో సినిమా కోసం తమిళ్ టాప్ హీరో ఆర్యకు డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లు ఒక హీరోగా నిలబడేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. అయితే నాకంటూ ఒక మంచి గుర్తింపు రావడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాలో ఉన్న విభిన్న రకాల టాలెంట్‌లను ప్రూవ్ చేసుకోవ డం అవసరమే. నాలోని ఒక కొత్త కళను గుర్తించి ఆర్య లాంటి పెద్ద హీరోకు డబ్ చెప్పమనడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రయో గాలకు నేను ఎప్పుడూ రెడీనే.
- నందు
ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాన్స్
మొట్టమొదటి సారిగా వేరొక నటుడికి నా వాయిస్ ఇవ్వాలని డెరైక్టర్ మణిరత్నం గారి నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగు దనం మిస్ కాని వాయిస్ కాబట్టే నన్ను సెలెక్ట్ చేశారని చెప్పడంతో మరింత థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. పైగా మణిరత్నం లాంటి లెజెండ్ మూవీలో ఏదో రకమైన అవకాశం వస్తే ఎలా కాదనగలను.. సో వెంటనే ఒప్పేసుకున్నా. ఓ కొత్త ప్రయోగం చేసినందుకు సంతోషంగా కూడా ఉంది.
- నాని
స్టార్స్‌లోనూ డబ్బింగ్ క్రేజ్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పెద్ద హీరోలు సైతం డబ్బింగ్ చెప్పడాన్ని క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకి ‘ఓకే బంగారం ’ సినిమాలో హీరోగా చేసిన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ స్వతహాగా తమిళ్, మలయాళం భాషల్లో ప్రావీణ్యుడు. తెలుగు భాషా నైపుణ్యం లేకపోవడంతో దుల్కర్‌కి మన తెలుగు హీరో నాని మొదటి సారిగా డబ్బింగ్ చెప్పారు. అదే విధంగా సైజ్ జీరో చిత్రంలో హీరో ఆర్యకు నందు చెబితే, తాజాగా విడుదలైన సల్మాన్‌ఖాన్ డబ్బింగ్ చిత్రం ‘ప్రేమలీల’లో ఆయన పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పడంతో.. ఈ డబ్బింగ్ ట్రెండ్‌కి స్టార్ స్టేటస్ స్థిరపడినట్టయింది. దీంతో మరింత మంది హీరోలు నిస్సంకోచంగా డబ్బింగ్‌కు సై అంటున్నారు.