మనం దేవుడి ఏజెంట్లం.. | we are god's agents, justice dave at judiciary officials meeting | Sakshi
Sakshi News home page

మనం దేవుడి ఏజెంట్లం..

Published Sun, Mar 20 2016 12:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మనం దేవుడి ఏజెంట్లం.. - Sakshi

మనం దేవుడి ఏజెంట్లం..

- న్యాయాధికారుల సమావేశంలో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ దవే
- భగవంతుడు తన పనులను మన ద్వారా నిర్వర్తిస్తున్నాడు
- పనితీరు ద్వారానే నైతిక విలువలు తెలుస్తాయి
- మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులు తగ్గుతున్నాయి
- పిటిషనర్, ప్రతివాది సంతోషంగా వెళ్లగలిగేది దీనిద్వారానే..
- జవాబుదారీతనం అలవర్చుకోవాలి: జస్టిస్ దీపక్ మిశ్రా
- రాజ్యాంగం కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు: జస్టిస్ ఎన్.వి.రమణ
- కోర్టు నాలుగు గోడల గది కాదు.. ఓ పవిత్ర దేవాలయం: కేసీఆర్
- ప్రపంచస్థాయిలో హైకోర్టు నిర్మిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
- ప్రారంభమైన రెండ్రోజుల న్యాయాధికారుల సమావేశం
 

సాక్షి, హైదరాబాద్:
విధి నిర్వహణలో మన స్సాక్షి ప్రకారం పనిచేస్తూ, మనస్సాక్షికే జవాబుదారీగా ఉండాలని ఉభయ రాష్ట్రాల న్యాయాధికారులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవే ఉద్బోధించారు. వృత్తిలో ఇతరులతో పోల్చుకోకుండా.. గణాంకాలతో సంబంధం లేకుండా పనిచేయగలిగినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు.

‘‘మనమంతా భగవంతుడి ఏజెంట్లం. ఆయన తన బాధ్యతలను మన ద్వారా నిర్వర్తింపచేస్తున్నాడు. అందువల్ల మనం చేసే ప్రతీ మంచి పని కూడా భగవంతుడికి చేసినట్లే. పనిలోనే భగవంతుడు ఉంటాడు. నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది’’ అని అన్నారు. నైతిక విలువలు పుస్తకాల్లో వెతికితే దొరికేవి కావని, మన పనితీరు ద్వారానే వాటిని బహిర్గతం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల రెండ్రోజుల రాష్ట్రస్థాయి సమావేశం  ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జస్టిస్ దవే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.రమణ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.చంద్రబాబు నాయుడు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, 900 మందికి పైగా న్యాయాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దవే మాట్లాడుతూ... ఇంత ముఖ్యమైన సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్న జస్టిస్ బొసాలేను అభినందించారు.

ఇలాంటి సమావేశాలతో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయాధికారులు పరస్పరం తమ ఆలోచనలను తెలుసుకునే అవకాశం ఉంటుందని, దీంతో అంతిమంగా కక్షిదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. జడ్జిగా బాధ్యతల నిర్వహణ అత్యంత పవిత్రమైన కార్యక్రమన్నారు. మధ్యవర్తిత్వ విధానాల ద్వారా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇది శుభపరిణామమన్నారు. అటు పిటిషనర్, ఇటు ప్రతివాది ఇద్దరూ సంతోషంగా వెళ్లగలిగేది మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమేనని తెలిపారు. రామదాసు, మీరాబాయి వంటి వారు భగవంతుడిని ఎలా ప్రేమించారో, మనం పనిని అలా ప్రేమించాలన్నారు. ఉభయ చంద్రులు (చంద్రశేఖరరావు, చంద్రబాబు) రెండు రాష్ట్రాలను అభివృద్ధి వైపు పురోగమింప చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి..
న్యాయాధికారులు జవాబుదారీతనం, నైతిక విలువలను అలవరచుకోవాలని జస్టిస్ దీపక్ మిశ్రా పిలుపునిచ్చారు. లక్ష్యాలను ఉన్నతంగా నిర్దేశించుకోవాలని, అప్పుడే కొంత వరకైనా విజయం సాధించగలుగుతామన్నారు. విధి నిర్వహణలో నేర్చుకోవాలన్న తపనను పెంచుకోవాలని సూచించారు. మేధోపరమైన ఆసక్తి ఉండాలే తప్ప, మేధావి కావాలన్న ఆసక్తి ఉండకూడదన్నారు. న్యాయాధికారులు న్యాయవ్యవస్థకు కెప్టెన్ వంటి వారని చెప్పారు.

పారదర్శకత అలవరుచుకోవాలి..
న్యాయపాలనలో పారదర్శకత అలవరచుకోవాలని జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయాధికారులను కోరారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరనప్పుడు వాటిని నేరవేర్చేందుకు న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రియాశీలత ప్రజా విశ్వాసానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి కోర్టుల్లో దాఖలవుతున్న కేసులే నిదర్శనమన్నారు. మనదేశంలో రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదని, అందరూ రాజ్యాంగం కిందే పనిచేయాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు నాశనమైతే సమాజంలో అరాచకం ప్రబలుతుందన్నారు.

‘‘సత్వర న్యాయం అందకపోవడం వల్ల అది వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు, నిధులిచ్చి మరిన్ని కోర్టుల ఏర్పాటుకు సహకరించాలి. సత్వర న్యాయం అందకుంటే న్యాయరహిత సమాజం ఏర్పడుతుంది’’ అన్నారు. తర్వాత ఆయన తెలుగులో మాట్లాడుతూ.. కన్నతల్లిని, మాతృదేశాన్ని, మాతృభాషను మరవకూడదన్నారు. ప్రపంచ పటంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని ఎగురవేయాలని ఇరువురు సీఎంలను కోరారు.
 
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం: జస్టిస్ దిలీప్ బి.బొసాలే
ప్రజలు న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. న్యాయవ్యవస్థ ప్రస్తుతం బలంగానే ఉందని, దాన్ని మరింత బలంగా చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న న్యాయాధికారులపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, అయితే ప్రజలు న్యాయవ్యవస్థపై ఉంచిన నమ్మకంతో వాటిని అధిగమిస్తున్నామని ఆయన తెలిపారు.
 
సమర్థంగా పనిచేస్తేనే సత్వర న్యాయం: కేసీఆర్
సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలకు సత్వర న్యాయం అందించడం సాధ్యమవుతుందని, ఆ దిశగా న్యాయాధికారులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలాంటి సమావేశాల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. న్యాయస్థానమంటే నాలుగు గోడల గది కాదని, అది ఓ పవిత్ర దేవాలయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు ప్రధాన అంగాలని, ఇవన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ మూడు వ్యవస్థలు ఎప్పటికప్పుడు తమ పనితీరును సమీక్షించుకుంటూ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని హామీనిచ్చారు.
 
ఆధునిక పరిజ్ఞానాన్ని కోర్టులకూ విస్తరిస్తాం: బాబు
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచస్థాయిలో హైకోర్టును నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. న్యాయమూర్తుల కోసం గృహ నిర్మాణ సముదాయాన్ని కూడా నిర్మిస్తామన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో ప్రజలకు నాణ్యమైన ఇంటర్‌నెట్ సేవలు అందిచనున్నట్లు తెలిపారు. రూ.149కే 15 ఎంబీపీఎస్‌తో ఇంటర్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయస్థానాలకూ విస్తరింపచేస్తామని తెలిపారు. అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు. నిన్నటి వరకు చైనా గురించి ప్రపంచం మాట్లాడుకునేదని, ఇప్పుడు భారత్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement