సీబీఐ వెంట పడతారేం?: హైకోర్టు
* హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
* అదేమైనా అంత పెద్ద సంస్థా?
* అసలు దానికి చట్టంలో చోటెక్కడుంది?
* దానికన్నా లోకల్ పోలీసులే నయం
* కెనెటా పవర్‌పై వ్యాజ్యం విచారణకు విముఖత
* పిటిషన్ ఉపసంహరించుకున్న పిటిషనర్
సాక్షి, హైదరాబాద్ : ‘‘సీబీఐ.. సీబీఐ..! ఎందుకంతా దాని వెంటపడతారు? అదేమైనా అంత పెద్ద సంస్థా? జస్ట్ ఓ డిటెక్టివ్ ఏజెన్సీలాంటిది. అది ఛేదించలేని కేసులెన్నో స్థానిక పోలీసులు ఛేదించారు. అయినా అందరికీ సీబీఐ ఫోబియా పట్టుకుందేంటి? అసలు దాని వెనకాల పడేందుకు దానికున్న చట్టబద్ధతేంటి? చట్టంలో దానికి స్థానమెక్కడైనా ఉందా? గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వటం వల్లే అది బతికి బట్టకడుతోంది. మేం మాత్రం సీబీఐ గురించి ఏమాత్రం పట్టించుకోం’’ అంటూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కెనెటా పవర్‌కు భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీల చేత దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాలశౌరి ఆస్తులు, కెనెటా పవర్ లిమిటెడ్‌కు భూ కేటాయింపులపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ న్యాయవాది ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ గతవారం ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ... ‘‘స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా? ముందు అది చేయండి. వారు స్పందించకుంటే మా వద్దకు రండి’’ అని చెప్పింది. తాము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ చెప్పగా... ‘‘అదంతా మాకు చెప్పొద్దు. పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో చెప్పండి’’ అని స్పష్టంచేసింది.
పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ చెప్పగా... తమకు చట్టం ఏం చెబుతుందో అదే ముఖ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘‘కోల్‌కతాలో ఓ బాలిక తప్పిపోయిన కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు ఆ బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్సై విజయవంతంగా ఆ కేసును ఛేదించి బాలిక ఆచూకీ కనుక్కున్నారు. సీబీఐ పనితీరు ఎలాంటిదో దీనినిబట్టి తెలుసుకోండి’’ అని ధర్మాసనం చెప్పింది. భూ కేటాయింపులకు మాత్రమే పరిమితమైతే పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.