ఇక పదవులు అడగమన్నా..!
‘మా పరిస్థితి కొండకు ఎదురు చూసినట్లు అయ్యింది. ఇవాళ.. రేపు అంటూ రెండేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఎదురు చూపులే మిగిలాయి తప్ప అందివచ్చిన పదవి ఏమీ లేదు. ఇక పదవులు అడగమన్నా..’ అంటూ గులాబీ నేతలు రాజీ పడిపోతున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధినేత రేపూ మాపూ అంటూ ఊరించిన పదవులు కొన్నే భర్తీ అయ్యాయి. పార్టీని నమ్ముకున్న.. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన కొందరు సీనియర్లను కదిలిస్తే కళ్ల నుంచి కన్నీళ్లు దునికేలా ఉన్నారు. ఆషాఢం.. శ్రావణం.. దసరా.. సంక్రాంతి అంటూ గడువులు పెట్టిన నాయకత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్న ఆవేదన వారిలో ఉంది.
ఒకరికి ఒకరు ఎదురు పడితే బేల చూపులు.. వెర్రి నవ్వులతో పలకరించుకుంటున్నామని తమపై తామే జోకులూ వేసుకుంటున్నారు. ‘ఎప్పుడు కనపడినా.. మీ జిల్లాలో నువ్వే మిగిలావ్.. ఈ సారి అయిపోతుందిలే..’ అన్న హామీలు పొంది పొందీ అలవాటై పోయిందని, పదవి మాత్రం అందని పండుగానే మిగిలిందన్న ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘మేము ఎంతో నయం.. ముందు నుంచీ పరిస్థితులకు అలవాటు పడినోళ్లం. ఏదో సంపాదిద్దామని పార్టీలోకి వచ్చిన కొత్తవాళ్ల పరిస్థితే కక్కలేక.. మింగలేక అన్నట్లు అయ్యింది..’ అని ఓ నేత అన్నారు. ఇక ముందూ మిగిలింది ఎదురు చూపులే.. ఇస్తే తీసుకుంటం.. ఇక పదవులు అడగం అన్న నిర్ణయానికి వచ్చినట్లు వారి మాటలు చెప్పకనే చెబుతున్నాయి!