అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నల్లగొండపై ఇంకా సస్పెన్సే
పెండింగులోనే భువనగిరి
పొత్తులకు ఇబ్బంది లేకుండా కసరత్తు
సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. ఈ ఎన్నికల్లో దాదాపు ఒంటరి పోరాటమే చేసేలా ఉన్న టీఆర్‌ఎస్ ఎలాంటి ఇబ్బందులు, బహునాయకత్వం లేని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు హుజూర్‌నగర్ సీటును ఖాయం చేశారు. ముందునుంచీ అంతా ఊహించిన విధంగానే ఆలేరుకు గొంగిడి సునీత, సూర్యాపేటకు గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. మిర్యాలగూడ - అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దేవరకొండ - లాలూనాయక్, నకిరేకల్ - వేముల వీరేశం పేర్లను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలనూ ఖరారు చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఏ పార్టీతోనైనా పొత్తులు కుదిరినా, ఇబ్బంది లేదనుకున్న స్థానాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా తొలి జాబితాలోని అభ్యర్థులు, ఆ స్థానాలు తమకు అత్యంత ముఖ్యమైనవని ప్రకటించినట్లయింది. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారు.
నల్లగొండ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సింహారెడ్డి మధ్య టికెట్ కోసం పోటీ ఉంది. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములు పోటీ పడుతుండగా, ఇటీవలే పార్టీలో చేరిన పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం క్యూలో ఉన్నారు. ఆయన శుక్రవారం భువనగిరిలో నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ కోసం ఏమాత్రం పోటీ లేని కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌తోనే ఉన్న గొంగిడి సునీతకు గత ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. అంతకుముందు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడం వల్ల రేసులో నిలిచే అవకాశమే రాలేదు. కాగా, పునర్విభజనలో భాగంగా ఆలేరు జనరల్ స్థానమైనా గత ఎన్నికల్లో కళ్లెం యాదగిరిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో సునితకు టికెట్ రాలే దు. కానీ ఈసారి మాత్రం తొలి జాబితాలోనే ఆమె పే రును ప్రకటించారు. జిల్లాలో టీఆర్‌ఎస్ గతంలో ప్రాతినిథ్యం వహించిన ఏకైక స్థానమైన ఆలేరు నుంచి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడైన పార్టీ అధికార ప్రతినిధి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి సూర్యాపేట నుంచి పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి సూర్యాపేటపై మొదటి నుంచి దృష్టి పెట్టి ఏర్పాట్లు చేసుకున్నారు.
పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పక్కన పెట్టి మరీ నకిరేకల్ ఇన్‌చార్జిగా అవకాశం ఇచ్చిన వేముల వీరేశానికి టికె ట్ ప్రకటించారు. ఇటీవలే సుధాకర్ పార్టీని వీడారు. ఆ ప్రభావం పార్టీపై పడకుండా ముందు జాగ్రత్తగా తొలి జాబితాలో నకిరేకల్‌ను చేర్చారు.
గత ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మిరాల్యగూడ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. కాగా, తొలి జాబితాలో అవకాశం దక్కించుకున్నారు.కొద్దిరోజుల కిందటి దాకా ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన లాలూ నాయక్ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆయనకు దేవరకొండ టికెట్‌ను ప్రకటించారు. గతంలో లాలూనాయక్ భార్య టీడీపీ తరపున దేవరకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారి కుటుంబం ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ను దక్కించుకుంది.