ఎంసెట్ -2 రద్దు ఉన్నట్లా.. లేనట్లా?
వైద్యవిద్య ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైన విషయం దాదాపుగా నిర్ధారణ అయ్యింది. పరీక్ష నిర్వహణకు సరిగ్గా రెండు రోజుల ముందు పేపర్ లీకైందని, ఇందులో పలువురు పాత్రధారులతో పాటు ముగ్గురు నలుగురు సూత్రధారులు కూడా ఉన్నారని సీఐడీ నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేస్తారా.. లేక అక్రమార్కులను మాత్రం పక్కకు తప్పించి మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారా అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చిచెప్పాల్సి ఉంది. దాదాపు 50 వేల మంది వరకు విద్యార్థులు ఎంసెట్-2 పరీక్ష రాశారు. వీళ్లలో మహా అయితే 30-40 మంది వరకు అక్రమాలకు పాల్పడి ఉంటారని అంటున్నారు. అలాంటప్పుడు మిగిలిన అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించడం ఎంతవరకు అవసరమన్న వాదన కూడా తాజాగా వస్తోంది. వెయ్యి నుంచి రెండు వేల వరకు ర్యాంకులు వచ్చిన విద్యార్థులను పరీక్షించాలని.. వాళ్లలో అక్రమాలకు పాల్పడినవారిని మాత్రం పక్కన పెట్టి.. మిగిలినవారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తమ ఇద్దరు పిల్లలకు 500 లోపు ర్యాంకులు వచ్చాయని, వాళ్లకు ఇప్పుడు కౌన్సెలింగ్ కాకుండా మళ్లీ పరీక్షలంటే ఇప్పుడు ఎలా రాయగలరని మెదక్ జిల్లాకు చెందిన ఓ తండ్రి వాపోయారు. ఎవరో కొంతమంది చేసిన తప్పునకు అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అన్నారు. కొంతమంది ఉన్నతాధికారులు కూడా వ్యక్తిగతంగా తమకు సైతం పరీక్ష రద్దు చేయడం ఇష్టం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. సీఐడీ విచారణ, పేపర్ లీకేజి వ్యవహారం ఇవన్నీ ఒక ఎత్తయితే.. దాదాపు 50 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మరో ఎత్తని.. అందువల్ల ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప ఈ విషయం తేలేలా లేదు.