నామాకు ప్రేమతో..! | With love to NAMA | Sakshi
Sakshi News home page

నామాకు ప్రేమతో..!

Oct 10 2016 1:15 AM | Updated on Aug 21 2018 8:34 PM

ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ కోట్లు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నామా నాగేశ్వరరావుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

- పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు
- రూ. 4,800 కోట్ల ప్రాజెక్టు నామాకు అప్పగింతకు సన్నాహాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ కోట్లు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నామా నాగేశ్వరరావుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా పేరొందిన ఆ మాజీ ఎంపీకి 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్కొక్కటీ 80 మెగావాట్లతో మొత్తం 12 ప్లాంట్లను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 5 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారుల అంచనా వేశారు. దాదాపు రూ. 4,800 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును సీఎం సన్నిహితుడు నామా నాగేశ్వరరావు అప్పగించేలా టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు మాత్రమే సరిపోయి, ఇతరులు పోటీకి రాకుండా మరికొన్ని నిబంధనలు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 త్వరలో టెండర్లు..
 పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఏపీజెన్‌కోకు అప్పగించారు. దీంతో టెండర్ ప్రక్రియ ప్రారంభించేందుకు జెన్‌కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచే వీలుంది. దీనికోసం ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల టెండర్లను పరిశీలించారు. కేంద్ర జల విద్యుత్ ఉత్పాదక సంస్థ అనుసరిస్తున్న నిబంధనలను కూడా అధ్యయనం చేశారు. అయితే ఆ నిబంధనలను మార్చాలని అధికారులు భావిస్తుండటంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే మార్పులు అనివార్యమని అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం సూచించిన కాంట్రాక్టర్‌కు ఈ పనులు అప్పగించడం అసలు ఉద్దేశమని తెలుస్తోంది.

జలవిద్యుత్ ఉత్పత్తి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు చేపట్టి ఉండాలనేది కేంద్రం, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ప్రాథమిక నియమం. దీన్ని కాదని.. ఏదైనా జల విద్యుత్ కేంద్ర నిర్మాణం చేసి ఉంటే చాలనే నిబంధన పెట్టనున్నారు. ఆర్థికపరమైన అంశాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. గడచిన ఐదేళ్ల టర్నోవర్‌ను పరిశీలించాలనే నిబంధనకు బదులు, ఐదేళ్లలో ఏదైనా రెండేళ్ల టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందనే టెండర్ నిబంధన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement