Hydro Electric Project
-
పొల్లూరు జలవిద్యుత్‌కు విఘాతం
సాక్షి, మోతుగూడెం (రంపచోడవరం): లోయర్ సీలేరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ (115 మెగావాట్లు) సాంకేతిక లోపంతో గురువారం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బోటమ్ లేబరెంట్ సీల్ ఊడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయిందని డీఈ (ఓఈఎం) సత్యనారాయణ తెలిపారు. ఈ గేట్ సీల్ ఊడిపోవడం వల్ల వికెట్ గేట్ వద్ద రాళ్లు, చెక్కలు అడ్డుపడి ఉండవచ్చునని ఆయన తెలిపారు. దీనివల్ల నీరు యూనిట్లలోకి వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవలే వికెట్ గేట్ సీల్ ఊడిపోయి సుమారు ఐదు రోజులు 4వ యూనిట్ నిలిచిపోయింది. దీంతో హుటహుటిన కాంట్రాక్టర్‌ను పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. మళ్లీ బోటమ్ లేబరెంట్ ఊడిపోవడం వల్ల మళ్లీ నాలుగో యూనిట్ సుమారు 25 రోజులపైనే 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనున్నది. దీంతో అభిరామ్ ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తున్నట్లు డీఈ తెలిపారు. తరచూ మొరాయిస్తున్న యూనిట్లు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి తరచూ 3, 4 యూనిట్లు మొరాయిస్తున్నా జెన్కో యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 45 ఏళ్లు అవుతున్నా యంత్ర సామగ్రి మార్చకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇక్కడ యూనిట్లకు ఏమైనా సాంకేతిక లోపం తలెత్తితే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే 25 ఏళ్ల నుంచీ ఒకే సంస్థకు పనులు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కుప్పకూలిన ప్రాజెక్టు: వందల్లో మృతులు?
వియాంటైన్, లావోస్ : నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్ డ్యామ్ కుప్పకూలడంతో కనీవినీ ఎరుగని విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆగ్నేయ లావోస్‌లో మంగళవారం జరిగింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా లెక్కతేలలేదు. వందలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య వేలలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6,500 మంది నిర్వాసితులు అయ్యారు. జల విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు లావోస్‌లో దేశవ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి అటాపీ ప్రావిన్సులో నిర్మిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి డ్యామ్ కుప్పకూలినట్లు అక్కడి మీడియాలో రిపోర్టులు వచ్చాయి. డ్యామ్ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా, వందల సంఖ్యలో ఇళ్లు సైతం నీటి ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో లావోస్ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. వియత్నాంకు చెందిన పీఎన్‌పీసీ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా దాదాపు 120 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 410 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ డ్యామ్ వచ్చే ఏడాది నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సివుంది. థాయ్‌లాండ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే ప్రధాన ఉద్దేశంతోనే దీన్ని నిర్మించతలపెట్టారు. -
నామాకు ప్రేమతో..!
- పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు - రూ. 4,800 కోట్ల ప్రాజెక్టు నామాకు అప్పగింతకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ కోట్లు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నామా నాగేశ్వరరావుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా పేరొందిన ఆ మాజీ ఎంపీకి 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్కొక్కటీ 80 మెగావాట్లతో మొత్తం 12 ప్లాంట్లను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 5 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారుల అంచనా వేశారు. దాదాపు రూ. 4,800 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును సీఎం సన్నిహితుడు నామా నాగేశ్వరరావు అప్పగించేలా టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు మాత్రమే సరిపోయి, ఇతరులు పోటీకి రాకుండా మరికొన్ని నిబంధనలు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో టెండర్లు.. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఏపీజెన్కోకు అప్పగించారు. దీంతో టెండర్ ప్రక్రియ ప్రారంభించేందుకు జెన్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచే వీలుంది. దీనికోసం ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల టెండర్లను పరిశీలించారు. కేంద్ర జల విద్యుత్ ఉత్పాదక సంస్థ అనుసరిస్తున్న నిబంధనలను కూడా అధ్యయనం చేశారు. అయితే ఆ నిబంధనలను మార్చాలని అధికారులు భావిస్తుండటంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే మార్పులు అనివార్యమని అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం సూచించిన కాంట్రాక్టర్‌కు ఈ పనులు అప్పగించడం అసలు ఉద్దేశమని తెలుస్తోంది. జలవిద్యుత్ ఉత్పత్తి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు చేపట్టి ఉండాలనేది కేంద్రం, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ప్రాథమిక నియమం. దీన్ని కాదని.. ఏదైనా జల విద్యుత్ కేంద్ర నిర్మాణం చేసి ఉంటే చాలనే నిబంధన పెట్టనున్నారు. ఆర్థికపరమైన అంశాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. గడచిన ఐదేళ్ల టర్నోవర్‌ను పరిశీలించాలనే నిబంధనకు బదులు, ఐదేళ్లలో ఏదైనా రెండేళ్ల టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందనే టెండర్ నిబంధన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.