పాముతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి, హైదరాబాద్: కాబోయే భర్త ఎదుటే యువతిని నిర్బంధిం చారు. పాముల్ని చూపించి బెదిరించారు. వివస్త్రను చేసి సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ఫాంహౌస్‌లో గత నెల 31న చోటు చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. నాటి ఘటనలో.. బాధితురాలు కేవలం ఆభరణాలు చోరీ అయినట్టు మాత్రమే ఫిర్యాదు చేసింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు.. తాజాగా ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తేలింది. ఈ అకృత్యానికి పాల్పడిన ఏడుగురు నిందితులను ఇదివరకే అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు శుక్రవారం ప్రధాన నిందితుడితో పాటు అతనికి ఆశ్రయం కల్పించిన యువకుడిని అరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం...
రంజాన్ మాసం ముగిసిన రెండు రోజుల అనంతరం గత నెల 31న ఉదయం వేళ ఓ కుటుంబం విడిది కోసం షాయిన్‌నగర్ ఉస్మాన్‌నగర్‌లోని తమ ఫాంహౌస్‌కు వచ్చింది. కొద్దిసేపటి అనంతరం కుటంబసభ్యులు వెళ్లిపోగా వారి కుటుంబానికే చెందిన 18 ఏళ్ల యువతి, ఆమె కాబోయే భర్త అక్కడే ఉండి ఫొటోలు తీసుకుంటున్నారు. ఇది గమనించిన ఎర్రకుంటకు చెందిన జిమ్ కోచ్ ఫైసల్ దయానీ (26), ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఖాదర్ బారక్‌బా (25), బండ్లగూడకు చెందిన తయ్యబ్ బాసలామా(20), షాయిన్‌నగర్‌కు చెందిన మహ్మద్ పర్వేజ్ (25), అన్వర్(19), ఖాజా అహ్మద్(26), మహ్మద్ ఇబ్రహీం (19)లు యువకుడిని కొట్టి గాయపరిచారు. పాముతో బెదిరించి యువతిని వివస్త్రను చేశారు. ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. ఆపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయమై అరిచినా, ఎవరికైనా చెప్పినా ఫేస్‌బుక్, సోషల్ నెట్‌వర్క్‌లలో సదరు ఫొటోలు పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఏడుగురు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు సాలం హమ్‌దీ (24), అలీ బారక్‌బా (27)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో అందర్ని ఇదివరకే అరెస్టు చేయగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ, సాలం హమ్‌దీలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, మొదట్లో భయంతో అరకొర వివరాలు చెప్పిన బాధితులు... పోలీసుల అభయంతో సామూహిక లైంగికదాడి జరిగిన విషయం బయటపెట్టారు. నిందితుల నుంచి 3 బైక్‌లు, స్కార్పియో వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు జతల అద్దాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆ ముగ్గురికి పాములతోనే ఆట.
ఫైసల్ దయానీతోపాటు తయ్యబ్ బా సలామా, మహ్మద్ పర్వేజ్‌లకు పాములతో ఆడుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పామునైనా ఇట్టే పట్టుకొని ఆడించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఒక్కోసారి నడి రోడ్లపై నిలబడి ఏడెనిమిది అడుగుల పొడవున్న పాములను మెడలో వేసుకొని... తోకతో పట్టుకొని కిందికి ఆడిస్తూ స్థానికులను బెదిరించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా నిందితులు పాముతోనే బెదిరించారు. కాగా, నిందితులు తాము చేసే ప్రతి పనిని సెల్‌ఫోన్లలో వీడియో తీసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. గతంలో వీరి బారిన పడిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తె వీరిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.