ఇంకెన్నాళ్లీ అఘాయిత్యాలు
♦ రాష్ట్రంలో మహిళలపై పెరిగిన అత్యాచారాలు, వరకట్నం,
♦ లైంగిక వేధింపులు ఆందోళన కలిగిస్తున్న యువతుల అక్రమ రవాణా
♦ నిర్భయ, పీడీ యాక్టు వంటి కేసులు పెడుతున్నా ఆగని దురాగతాలు
సాక్షి, హైదరాబాద్: మహిళలను దేవతగా పూజించే దేశంలో మానవ మృగాల దురాగతాలు మరింత పెచ్చరిల్లుతున్నాయి. వేధింపులు, అత్యాచారాలు, అక్రమ రవాణా వంటి నేరాలు పెరుగుతూనే ఉన్నా యి. వీటి కట్టడి కోసం పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ‘ట్రాఫికింగ్’ ఘటనలపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు.
భారీగా వరకట్న వేధింపుల కేసులు
రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్నట్లు వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పనిచేసే చోట వేధింపులకు గురవుతున్నవారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ‘నిర్భయ’ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా అత్యాచార ఘటనలు తగ్గడం లేదు. వరకట్న వేధింపుల కేసులైతే మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2014లో మొత్తం 5,844 వరకట్న కేసులు నమోదుకాగా... 2015కు వచ్చే సరికి 6,763 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎన్నారైలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకెళ్లాక వేధింపులకు గురిచేసి పంపించడమో, ఇక్కడే వదిలి వెళ్లడమో చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాల్లో ఉంటున్నందున వారిని అరెస్టు చేయడం కష్టంగా మారుతోంది.
మహిళల ఆధ్వర్యంలోనే ట్రాఫికింగ్!
ఉద్యోగాల పేరుతో యువతులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపే ముఠాల్లో మహిళల పాత్ర పెరుగుతున్నట్లు పలు కేసుల దర్యాప్తులో తేలింది. గతేడాది రాష్ట్రంలో అక్రమ రవాణాకు సంబంధించి 554 కేసులు నమోద వగా... 808 మంది యువతులను రక్షించారు. అందులో 308 మంది బాలికలున్నారు. గతేడాది మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సీఐడీ ప్రత్యేక బృందాలు దాడి చేసి, 46 మంది నిందితులను అరెస్టు చేయగా... అందులో 32 మంది మహిళలే. అక్రమ రవాణాను నిరోధించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఐడీ నిర్ణయించింది.