ఒకే రోజు 10చోట్ల తెగబడ్డారు..
హైదరాబాద్ : భాగ్య నగరాన్ని చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనిపించటమే ఆలస్యం... వారు తమ ప్రతాపం చూపిస్తున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలకు మహిళలు బలైపోతున్న విషయం తెలిసిందే. తాజాగా దుండగులు మంగళవారం ఒక్కరోజే పదికి పైగా బంగారు గొలుసుల చోరీలకు పాల్పడ్డారు.
ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వేగంగా వచ్చి... రోడ్డుపై నడుచుకుని వెళుతున్న మహిళల మెడలోని నగలు క్షణాల్లో లాక్కొని పరారవుతున్నారు. కూకట్‌పల్లిలోని ధర్మారెడ్డికాలనీ, వివేకానందా నగర్‌లోని రెండు ఘటనల్లో ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు. ఇక సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్‌నగర్, దోమలగూడా, అశోక్‌నగర్‌లలో 21 తులాల బంగారాన్ని తెంచుకు వెళ్లారు.
గణేష్ నిమ్మజ్జనంలో రెండురోజులు అవిశ్రాంతంగా పనిచేసిన పోలీసులు, తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో మునిగిపోవడంతో పక్కాప్రణాళికతో స్నాచర్‌లు రంగంలోకి దిగారు. అంతర్ రాష్ట్ర ముఠాలకు చెందిన పాతనేరస్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో మహిళలు రోడ్లపైకి రావడానికి వణికిపోతున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు.