
పరస్పర ఆర్థిక సహకారం దిశగా కృషి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఒంటారియో మధ్య పరస్పర ఆర్థిక సహకారానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కెనడాలోని ఒంటారియో-తెలంగాణ మధ్య లాభదాయకమైన రీతిలో ఆర్థిక సహకారం ఉండేలా రూపొందించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఒంటారియో పక్షాన వాణిజ్య ఉప మంత్రి హెలెన్ అంగన్ సంతకాలు చేశారు.
ఇరు ప్రాంతాల్లో వాణిజ్య అవకాశాలపై దేశీయ కంపెనీలకు అవగాహన కల్పించడం.. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలతో దేశీయ కంపెనీలను అనుసంధానించడం.. ఇరు ప్రాంతాల్లో మార్కెటింగ్ అవకాశాలు మెరుగు పరిచేలా వాణిజ్య బృందాల పర్యటనలు, సదస్సులు ఏర్పాటు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన విధానం ద్వారా 18 నెలల కాలంలోనే గూగుల్, అమెజాన్, ఉబెర్ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఐటీ, వ్యవసాయం, మౌలిక వసతులకు సంబంధించిన రంగాల్లో తెలంగాణ-ఒంటారియో మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారానికి అవకాశముందని ఒంటారియో ప్రీమియర్ కాథలిన్ వీన్ అన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఒంటారియో మంత్రి దీపికా దామెర్ల, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంస్థల మధ్య కీలక ఒప్పందాలు..
గురువారం హైదరాబాద్‌లో జరిగిన మరో కార్యక్రమంలో ఒంటారియోకు చెందిన పలు సంస్థలు.. తెలంగాణ సంస్థలు, కంపెనీలతో కీలక ఒప్పందాల (ఎంవోయూ)ను కుదుర్చుకున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఒంటారియో ప్రీమియర్ కాథలిన్ వీన్ సమక్షంలో వీటిపై సంతకాలు జరిగాయి. శంషాబాద్ వద్ద రూ.వంద కోట్లతో ట్యాబ్లెట్, సెల్‌ఫోన్, నోట్‌బుక్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు డేటావిండ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఐఐటీ హైదరాబాద్-మిచిగాన్ యూనివర్సిటీ, ఆస్ట్రా మైక్రోవేవ్.. యూనిక్ బ్రాడ్‌బ్యాండ్, న్యూక్లియన్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ).. కనెక్ట్రిక్స్, షోలాంట్రో.. స్మార్ట్‌ట్రాక్ కంపెనీల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఒంటారియోలో ఏడు లక్షల మందికి పైగా భారత సంతతివారు ఉన్నారని కాథలీన్ వీన్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జన్మించిన తాను సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉందని ఒంటారియో మంత్రి దీపిక దామెర్ల అన్నారు.