
విశ్వనగర పనులకు శ్రీకారం
- మూడు ప్రాంతాల్లో నేడు శంకుస్థాపనలు
- పనుల మొత్తం వ్యయం 889 కోట్లు
- ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి.. విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీగా చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు జరగనున్నాయి.
దాదాపు ఏడాది కాలంగా ఈ పనులకు సంబంధించిన కసరత్తు జరుగుతుండగా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో వీటిని పట్టాలెక్కించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా మొత్తం ఐదు ప్యాకేజీల్లో 18 పనులకు టెండర్లను ఆహ్వానించారు. వాటిల్లో 1, 4 ప్యాకేజీల్లోని పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ. 889 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.
కేబీఆర్ పార్కు వద్ద రూ. 510 కోట్లతో.. జేఎన్‌టీయూ రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద రూ. 113 కోట్లు, అయ్యప్ప సొసైటీ జంక్షన్ వద్ద రూ. 266 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనులకు పలు ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు అంకురార్పణ జరుగనుంది. ఈ పనుల కోసం తొలుత ఈపీసీ-డిఫర్డ్ యాన్యుటీ విధానంలో జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ వాటిని రద్దు చేసి, వాటిస్థానే ఈపీసీ విధానంలో అంతర్జాతీయస్థాయి టెండర్లను ఆహ్వానించింది. తొలుత ఒకే ప్యాకేజీగా ఉన్న 18 పనులను ఆ తర్వాత ఐదు ప్యాకేజీలుగా విభజించారు. 18 పనుల్లో భూసేకరణ తదితర ఇబ్బందుల దృష్ట్యా 2 పనులను పూర్తిగా రద్దు చేశారు. రెండు నెలల క్రితమే టెక్నికల్ బిడ్లు ఆమోదించినా.. గత రెండు మూడు రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్లను ఆమోదించారు.