Universal City
-
రెండున్నరేళ్లలో ఏం చేశారు?
-
రెండున్నరేళ్లలో ఏం చేశారు?
అసెంబ్లీలో బీజేఎల్పీ నేత జి. కిషన్ రెడ్డి ► విశ్వనగరం ఏమో కానీ.. విషాదనగరం చేయకండి ►గాలిలో మేడలు కడుతూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు ►రూ. 21 వేల కోట్లు ఖర్చు చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పండి ►జీహెచ్ఎంసీని ముందు ప్రక్షాళన చేయండి.. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని బీజేపీ శాసన సభాపక్ష నేత జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ. 21 వేల కోట్లను ఖర్చు పెట్టి మహానగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెపుతోం దని, అవన్నీ ప్రణాళికల స్థాయిలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందడం ఏమో కానీ.. విషాదనగరంగా మాత్రం మార్చవద్దని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన లఘుచర్చలో ఆయన పాల్గొన్నారు. ‘హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు. హైదరాబాద్ అంటే మలక్‌పేట, హైదరాబాద్ అంటే పాతబస్తీ, హైదరాబాద్ అంటే అంబర్‌పేట. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసినప్పుడే మహానగరం విశ్వనగరం అవుతుంది. అలాంటి అభివృద్ధిలో మేం కూడా భాగస్వాములమవుతాం. కేంద్రాన్ని కూడా ఒప్పించి సహాయ పడతాం’అని చెప్పారు. జీహెచ్ఎంసీలో అవినీతి పేరుకుపోయిందని, ఉద్యోగుల ప్రక్షాళన అత్యవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వనగరంగా మార్చడమ నేది దీర్ఘకాలిక పని అని, ఈ లక్ష్యాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే, తక్షణావసరాల కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గాలొస్తే కరెంటు కోతలు, వానొస్తే ట్రాఫిక్ సమస్యలు.. ఇలా నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయిందని, కనీసం రోడ్లు మరమ్మతులు కూడా లేక జనాలు నానా అవస్థలు పడుతున్నారని చెపుతూ ఇటీవల మల్కాజ్‌గిరిలో జరిగిన ఓ ఘటనను కూడా ఉదహరించారు. ‘నేను మల్కాజ్గిరి వెళుతున్నప్పుడు ఓ కొత్త జంట ద్విచక్రవాహనంపై వెళ్తోంది. మా వాహనం ముందు వెళుతున్న వారు మాకు సైడ్ కూడా ఇవ్వలేదు. ఎంత హారన్ కొట్టినా స్పందించలేదు. దానికి తోడు బండి నడుపుతున్న వ్యక్తి తన భార్యను పదేపదే తడుముతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక కొద్ది దూరం వెళ్లాక సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆ జంటను నేను ప్రశ్నించా. కొత్తగా పెళ్లయితే ఇంటి దగ్గర సరసాలాడుకోవాలి కానీ రోడ్లమీదెందుకుని మందలించే ప్రయత్నం చేశా. అప్పుడా వ్యక్తి సమాధానమిస్తూ తానేమీ తన భార్యతో సరసం ఆడటం లేదని, కొత్తగా గ్రామం నుంచి వచ్చిన నా భార్య సిటీ రోడ్డు గుంతల్లో ఎగరేసినప్పుడు ఉందో, కిందపడిపోయిందా చూసుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నగర వాస్తవ పరిస్థితి.. నగరవాసి మనోవేదన నాకు అర్థమయ్యాయి’అని కిషన్ రెడ్డి చెప్పారు. మూసీ మురికి నల్లగొండకా?: కోమటిరెడ్డి హైదరాబాద్ నగరంలోని మూసీ నది నీటిని ట్రీట్మెంట్ చేసి ఆ మురికి నీటిని నల్లగొండ జిల్లా ప్రజల జీవితాల్లోకి పంపుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీరు పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేట వరకు దాదాపు 150 కిలోమీటర్లు వెళ్తోందని ఆయన చెప్పారు. ఎన్ కన్వెన్షన్ లో ఆక్రమణ జరిగిందని, జీహెచ్ఎంసీ అధికారులే మార్కింగ్ చేసినా ఇంతవరకు దానిని కూల్చలేదని, కానీ, పేదలు, తెలంగాణ ప్రజలు కట్టుకున్న భండారీ లేఅవుట్‌ను ఎందుకు కూల్చారని ఆయన ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ సభ్యుడు టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉపన్యాసంలో ప్రస్తావించిన అభివృద్ధంతా ప్రణాళికల స్థాయిలోనే ఉందన్నారు. టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాలం చెల్లిన చెరువులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ఏం మెరుగుపడింది? రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం ఏ విషయంలో మెరుగుపడిందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గాలిలో మేడలు కడుతూ ఇదే హైదరాబాద్ అభివృద్ధి అని ప్రభుత్వం అనుకుంటోందని, కన్సల్టెంట్లు గీసిన డ్రాయింగ్లను పత్రికలకు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం జీహెచ్ఎంసీలో రోడ్లు వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. టాటా, రిలయన్స్ కంపెనీలు జీహెచ్ఎంసీ రోడ్లను తవ్వుతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులు అడ్డుపడబోగా.. హైదరాబాద్‌కు పట్టిన పీడ మజ్లిస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. -
సమయమివ్వండి.. మార్పు చూపిస్తాం
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ► అభివృద్ధి జరగనిదే జీహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిపించారా? ► మూసీ రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన ► ఎన్ –కన్వెన్షన్ లో అక్రమాలుంటే చర్యలుంటాయని వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజూ మంచినీరు సరఫరా చేయాలనుకుంటున్నామని, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని మొదలుపెట్టి నగరమంతటికి విస్తరిస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. తొలుత 150 ఎల్పీసీడీ చొప్పున దాదాపు 50,000 కుటుంబాలున్న 200 మురికివాడల్లో ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నగర శివార్లలో నీటి సరఫరాను మెరుగుపరచటానికి రూ.1,700 కోట్ల హడ్కో నిధులు, రూ.200 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌తో ఒక ప్రాజెక్టును రూపొందించామని మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప చర్చకు సమాధానమిస్తూ చెప్పారు. నగరంలో 56 రిజర్వాయర్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 2,600 కి.మి. పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 550 కి.మి. మేర పూర్తి చేశామని చెప్పారు. 50 ఏళ్ల వరకు హైదరాబాద్‌లో సురక్షిత, ఆధారపడదగ్గ నీటి పరఫరా ఉండేలా కృష్ణా, గోదావరి బేసిన్ల కింద 20 టీఎంసీల సామర్థ్యంతో షామీర్పేట, దేవలమ్మనగరం వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మురుగు నీటి వ్యవస్థను పటిష్టపరచడానికి నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి రెండు జోన్లలో రూ.400 కోట్లతో పనులు ఇప్పటికే పూర్తి చేసినట్టు చెప్పారు. మరో 4 జోన్లలో రూ.1,200 కోట్లతో పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. స్కైవే, ప్రధాన రోడ్డు కారిడార్, గ్రేడ్ సపరేటర్లు వంటివాటితో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ పనుల కోసం రూ.2,631 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన పరమైన మంజూరు ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణాలు చేస్తామని తెలిపారు. ఉప్పల్‌లో ప్రయోగాత్మకంగా వేసిన ప్లాస్టిక్ రోడ్డు విజయవంతమైందని, అనేక సర్కిళ్లలో ప్లాస్టిక్ రోడ్డు పనులు చేపడుతున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్‌తో మాదాపూర్, హైటెక్‌సిటీని అనుసంధానం చేయడానికి రూ.184 కోట్లతో మాదాపూర్ దుర్గం చెరువుపై దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జీని వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పునరుద్ధరణ టెండర్ పూర్తయితేనే తవ్వకాలకు అనుమతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయన్న సభ్యుల ఆందోళనపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ తవ్వకాలు జరపాల్సి వచ్చినా, ఆ రోడ్డు పునరుద్ధరణ టెండర్ ప్రక్రియ పూర్తయితేనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దీనిపై అవసరమైతే చట్టం తెస్తామన్నారు. నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదని, కేవలం కొన్ని చోట్ల సవరణలు చేశామని తెలిపారు. ఆక్రమణలుంటే ఎన్ –కన్వెన్షన్ పై చర్యలు.. అక్రమ నిర్మాణాల అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ, బండారి లేఅవుట్, అయ్యప్ప సొసైటీలో అక్రమాలను కూల్చివేసిన ప్రభుత్వం ఎన్ –కన్వెన్షన్ విషయంలో ఎందుకు చోద్యం చూస్తున్నదని ప్రశ్నించారు. ఎన్ –కన్వెన్షన్ ను గిఫ్ట్‌గా ఇవ్వదలిచారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నాగార్జున సర్కిల్లో మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్ స్పందిస్తూ, తమకు పేద, పెద్ద అన్న తారతమ్యం లేదని, గిఫ్ట్‌ల సంస్కృతి తమకు లేదని స్పష్టంచేశారు. ఎన్ –కన్వెన్షన్ విషయంలో నాగార్జునకు తామేదో మేలు చేస్తున్నామని ఆరోపిస్తున్నారని, అది వాస్తవం కాదని తెలిపారు. అక్రమాలుంటే చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. విశ్వనగరం చేసి చూపుతాం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కరాత్రిలో విశ్వనగరం సాధ్యం కాదని, సమయం ఇస్తే మార్పు చేసి చూపిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లలో ఎలాంటి మార్పులేదన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షాలను తూర్పారబట్టిన మంత్రి, మార్పు లేకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించిందా, అని ప్రశ్నించారు. ‘గతంలో కరెంట్ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు. మంచి నీళ్ల కోసం పానిపట్టు యుద్ధాలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగాయి. శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉండేది. కానీ తెలంగాణ వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. నీటి సరఫరాను పెంచి వేసవిలో చిన్న ఆందోళన జరగకుండా చూశాం. నేరాలు తగ్గాయి. స్వచ్ఛభారత్ అంటే ఫోజులిచ్చి బయట పడటం కాదని, నిజమైన స్వచ్ఛత ఎలా ఉండాలో దేశానికే చేసి చూపించాం. జీహెచ్ఎంసీలో యునిఫైడ్ సర్వీస్ రూల్స్ తెచ్చాం. గుడుంబా, పేకాటలను బం ద్ చేయించాం. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు. ఏడాది చివరికి మెట్రో పూర్తి మొదటి విడత మెట్రో పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని, రెండో దశను 2018 చివరకి పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. అలైన్ మెంట్ మార్పులతో ప్రాజెక్టు ఆలస్యమైందన్న ఆరోపణ నిజం కాదని, మెట్రో పార్కింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలల స్థలాలను తీసుకుంటు న్నారన్నది వాస్తవం కాదని తెలిపారు. మూసీ నది సుందరీకరణ కోసం మూసీ రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నామని, నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఫుట్‌పాత్ వ్యాపారులకు హాకింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తామని, వచ్చే సమావేశాల్లో స్ట్రీట్ వెండర్ బిల్లు తెస్తామని చెప్పారు. -
విశ్వనగరం ఎలా సాధ్యం?
♦ సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ♦ స్థానిక సంస్థలను అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ♦ వీటిని కాక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ♦ ఎంచుకోవాలి.. ‘వన్హైదరాబాద్’ నేతలు ♦ రాఘవులు, చాడ, జేపీ, తమ్మినేని, గౌస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరం ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, లోక్‌సత్తా నేతలు ప్రశ్నించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని అసమర్థ, అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను కాకుండా, స్వచ్ఛమైన పాలన అందించే తమ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమవారం సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, లోక్‌సత్తా నేతలు జయప్రకాష్‌నారాయణ, పాండురంగారావు, ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పాత, కొత్త నగరాలు... ముస్లిం, హిందువు... తెలంగాణ, ఆంధ్రా, ఉత్తర భారత్ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటే అని గర్వంగా ప్రకటించడమే... ‘వన్ హైదరాబాద్’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు నిధులను హరించడం, సమస్యల పరిష్కారంలో చిన్న చూపు తప్ప స్థానిక సంస్థలపై నమ్మకం, గౌరవం లేదని బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల హక్కులను హరించి, పరోక్షంగా తామే పాలన సాగిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని జయప్రకాష్‌నారాయణ సూచించారు. ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్‌సత్తా కూటమి నేతలు కావాలా?... ఎన్నికలను, పదవులను నిచ్చెనగా చేసుకుని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో?.. ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన వారే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ అవకాశవాదంతో ప్రకటనలు చేస్తున్నారని ఎండీ గౌస్ ఎద్దేవా చేశారు. రాజకీయ అనిశ్చితి కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. -
కేసీఆర్ మొండి మనిషి
►‘గ్రేటర్’ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారు: కేటీఆర్ ► హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే సత్తా టీఆర్ఎస్కే ఉంది ► 50 ఏళ్ల దారిద్య్రాన్ని క్రమంగా దూరం చేస్తున్నాం ► టీఆర్ఎస్కు పట్టం కడితే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం ► సీమాంధ్రుల భయాందోళనలు అపోహలే అని తేలాయి హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొండి మనిషి అని, ఆయన చెప్పిండంటే హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసి తీరుతాడని, ఇందులో మరో ఆలోచనకు అవకాశమే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. 50 ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను విపక్ష పార్టీలు భ్రష్టు పట్టించాయని.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు పట్టంకడితే.. ఐదేళ్ల వ్యవధిలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపెడతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం మీర్పేట్లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు లేవని విమర్శించే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. 50 ఏళ్ల వ్యవధిలో ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మేయర్లుగా బాధ్యతలు చేపట్టారని, అయినా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను పరిగణనలోకి తీసుకోలేదని, ఫలితంగానే మంచినీటి కొరత, రహదారుల అసౌకర్యం, పౌరులకు రక్షణ లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న తమ మాటలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. తెలంగాణ ఏర్పడితే.. సీమాంధ్రులపై దాడులు జరుగుతాయన్న మాటలు దూదిపింజలే అని తేలిపోయాయన్నారు. మధ్యతరగతి వర్గాలకు సైతం డబుల్ బెడ్రూం తరహా గృహవసతి కల్పించే చర్యలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడతామని చెప్పారు. ప్రధాని మోదీపై విసుర్లు.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఇప్పటి వరకు 40 దేశాలను చుట్టివచ్చారని, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను మాత్రం తిరగలేకపోయారని మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానిగా హైదరాబాద్ ప్రజ లకు ముఖం కూడా చూపించలేదన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు గ్రేటర్ ప్రజలు సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు ఏ తీపికబురూ చెప్పలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌రావ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
విశ్వనగర పనులకు శ్రీకారం
-
విశ్వనగర పనులకు శ్రీకారం
- మూడు ప్రాంతాల్లో నేడు శంకుస్థాపనలు - పనుల మొత్తం వ్యయం 889 కోట్లు - ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి.. విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీగా చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు జరగనున్నాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ పనులకు సంబంధించిన కసరత్తు జరుగుతుండగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో వీటిని పట్టాలెక్కించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ)లో భాగంగా మొత్తం ఐదు ప్యాకేజీల్లో 18 పనులకు టెండర్లను ఆహ్వానించారు. వాటిల్లో 1, 4 ప్యాకేజీల్లోని పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ. 889 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. కేబీఆర్ పార్కు వద్ద రూ. 510 కోట్లతో.. జేఎన్టీయూ రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద రూ. 113 కోట్లు, అయ్యప్ప సొసైటీ జంక్షన్ వద్ద రూ. 266 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనులకు పలు ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు అంకురార్పణ జరుగనుంది. ఈ పనుల కోసం తొలుత ఈపీసీ-డిఫర్డ్ యాన్యుటీ విధానంలో జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ వాటిని రద్దు చేసి, వాటిస్థానే ఈపీసీ విధానంలో అంతర్జాతీయస్థాయి టెండర్లను ఆహ్వానించింది. తొలుత ఒకే ప్యాకేజీగా ఉన్న 18 పనులను ఆ తర్వాత ఐదు ప్యాకేజీలుగా విభజించారు. 18 పనుల్లో భూసేకరణ తదితర ఇబ్బందుల దృష్ట్యా 2 పనులను పూర్తిగా రద్దు చేశారు. రెండు నెలల క్రితమే టెక్నికల్ బిడ్లు ఆమోదించినా.. గత రెండు మూడు రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్లను ఆమోదించారు. -
'చంద్రబాబు డబ్బు వ్యవహారాల గురించి నాకే బాగా తెలుసు'
హైదరాబాద్: రాజకీయాల్లో డబ్బు ప్రవాహాన్ని తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని.. ఆయన డబ్బు వ్యవహారాల గురించి తనకే బాగా తెలుసునని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను నిప్పంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏపీకి ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఆయన అన్నారు. నగరంలో 20 ఏళ్లుగా విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయని తెలిపారు. రూ.25 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అదే విధంగా కొత్త నిర్మాణాల కోసం సింగిల్ విండో అనుమతులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అవసరం లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అంతేకాకుండా 111 జీవో విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.