టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని బీజేపీ శాసన సభాపక్ష నేత జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ. 21 వేల కోట్లను ఖర్చు పెట్టి మహానగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెపుతోం దని, అవన్నీ ప్రణాళికల స్థాయిలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందడం ఏమో కానీ.. విషాదనగరంగా మాత్రం మార్చవద్దని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన లఘుచర్చలో ఆయన పాల్గొన్నారు. ‘హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు. హైదరాబాద్ అంటే మలక్‌పేట, హైదరాబాద్ అంటే పాతబస్తీ, హైదరాబాద్ అంటే అంబర్‌పేట. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసినప్పుడే మహానగరం విశ్వనగరం అవుతుంది. అలాంటి అభివృద్ధిలో మేం కూడా భాగస్వాములమవుతాం.