'చంద్రబాబు డబ్బు వ్యవహారాల గురించి నాకే బాగా తెలుసు'
హైదరాబాద్: రాజకీయాల్లో డబ్బు ప్రవాహాన్ని తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని.. ఆయన డబ్బు వ్యవహారాల గురించి తనకే బాగా తెలుసునని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను నిప్పంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏపీకి ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు.
అదే విధంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఆయన అన్నారు. నగరంలో 20 ఏళ్లుగా విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయని తెలిపారు. రూ.25 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అదే విధంగా కొత్త నిర్మాణాల కోసం సింగిల్ విండో అనుమతులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అవసరం లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అంతేకాకుండా 111 జీవో విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.