
కేసీఆర్ మొండి మనిషి
►‘గ్రేటర్’ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారు: కేటీఆర్
► హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉంది
► 50 ఏళ్ల దారిద్య్రాన్ని క్రమంగా దూరం చేస్తున్నాం
► టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
► సీమాంధ్రుల భయాందోళనలు అపోహలే అని తేలాయి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొండి మనిషి అని, ఆయన చెప్పిండంటే హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసి తీరుతాడని, ఇందులో మరో ఆలోచనకు అవకాశమే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. 50 ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను విపక్ష పార్టీలు భ్రష్టు పట్టించాయని.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంకడితే.. ఐదేళ్ల వ్యవధిలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపెడతామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం మీర్‌పేట్‌లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు లేవని విమర్శించే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. 50 ఏళ్ల వ్యవధిలో ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మేయర్లుగా బాధ్యతలు చేపట్టారని, అయినా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను పరిగణనలోకి తీసుకోలేదని, ఫలితంగానే మంచినీటి కొరత, రహదారుల అసౌకర్యం, పౌరులకు రక్షణ లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న తమ మాటలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. తెలంగాణ ఏర్పడితే.. సీమాంధ్రులపై దాడులు జరుగుతాయన్న మాటలు దూదిపింజలే అని తేలిపోయాయన్నారు. మధ్యతరగతి వర్గాలకు సైతం డబుల్ బెడ్‌రూం తరహా గృహవసతి కల్పించే చర్యలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడతామని చెప్పారు.
ప్రధాని మోదీపై విసుర్లు..
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఇప్పటి వరకు 40 దేశాలను చుట్టివచ్చారని, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను మాత్రం తిరగలేకపోయారని మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానిగా హైదరాబాద్ ప్రజ లకు ముఖం కూడా చూపించలేదన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు గ్రేటర్ ప్రజలు సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు.
విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు ఏ తీపికబురూ చెప్పలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌రావ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొన్నారు.