పల్లె ‘ప్రగతి’ ఇంతేనా?
- ప్రపంచ బ్యాంకు అసంతృప్తి
- రూ.300 కోట్లకు రూ.21 కోట్ల కేటాయింపులా?
- ప్రాజెక్ట్ లక్ష్యాలను చేరుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎస్‌కు లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం నిధులు కేటాయించలేదని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద రైతు కుటుంబాల సంక్షేమానికి రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచ బ్యాంక్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతేడాది జనవరి 27న ప్రపంచ బ్యాంక్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగా హన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం లో పేర్కొన్న విధంగా ప్రాజెక్ట్ అమలు జరగ డం లేదని ప్రపంచ బ్యాంకు విచారం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్(ఇండియా) జునైద్ కమల్ అహ్మద్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఘాటుగా లేఖ రాశారు. ‘‘ప్రాజెక్టును నిర్వహించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయలేదు. గతేడాది ఏప్రిల్ 18 నుం చి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కీలకమైన ప్రాజెక్టు అధికారుల నియామకం చేపట్టలేదు. ఒప్పందంలో పేర్కొ న్న విధంగా మొత్తం రూ.642 కోట్ల అంచనా తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.192 కోట్లు ఖర్చు చేయాలి. 2020 కల్లా ప్రాజెక్ట్ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ధేశించింది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతానికి మించి నిధులు విడుదల చేయలేదు’’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దృష్టికి తెచ్చినా
ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన సమస్య లను తమ బృందం వివిధ స్థాయిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని లేఖలో ప్రస్తావించింది. గతేడాది బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.10కోట్లు విడుదల చేయగా.. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.11 కోట్లు కేటాయించడం బాధాకరమని పేర్కొంది. రెండేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టుకు, కేవలం రూ.21 కోట్లు కేటాయించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు ‘అసంతృప్తి’ రేటింగ్‌ను ఇవ్వాలని టాస్క్ టీమ్ నిర్ణయిం చిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు పెంచాలని, నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచించారు.
పల్లె ప్రగతి ప్రణాళిక ఇలా..
ఈ పథకం ద్వారా అయిదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది లక్ష్యం. ఇందులో జీవనోపాధులకు అత్యం త ప్రాధాన్యత కల్పించింది. ప్రధానంగా పలు రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తి దారుల సంస్థ (ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50శాతం పెంపొందేలా చర్యలు చేపటాలి. సాగు పద్ధతులపై అవగాహన కల్పన, ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధర పొందేలా సెర్ప్ శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలి. మానవాభివృద్ధిలో కీలకమైన ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాలకు నాణ్యమైన విద్యను అందించాలనేది లక్ష్యం. నిధుల కొరత, తగిన సిబ్బంది లేకపోవడంతో ఇవేవీ ముందుకు సాగలేదు.