ప్రపంచ బ్యాంకుకు నివేదించిన విద్యుత్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు కత్తెరేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ప్రపంచబ్యాంక్‌కు వివరించారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే వేగం పెంచామని, త్వరలోనే లక్ష్యాలను చేరుకుంటామని కూడా పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎలా కట్టడి చేస్తున్నది వివరిస్తూ ఓ నివేదిక ఇచ్చారు. తమ పురోగతిని చూసి వీలైనంత త్వరగా రుణం మంజూరు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు మణికురానా, అతుల్‌తో గురువారం ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంధనశాఖ సలహా దారు రంగనాథం భేటీ అయ్యా రు.
రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం గతంలో వరల్డ్ బ్యాంక్ సుమారు రూ. 2,600 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 2014 నుంచి ఈ రుణం మంజూరు కోసం ప్రపంచబ్యాంక్ సవాలక్ష షరతులు విధిస్తూ వస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించాలని, ఉచిత విద్యుత్ పంపిణీని దశలవారీగా తగ్గించాలని ప్రపంచబ్యాంక్ షరతులు పెడుతోంది.
10 లక్షల స్మార్ట్ మీటర్లు
మీటర్ రీడింగ్‌ను ఇళ్ల వద్దకు వెళ్లి తీసుకునే పద్ధతికి స్వస్తి చెబుతున్నామని, ఇందులో భాగంగా 10 లక్షల స్మార్ట్ మీటర్లు అమరుస్తామని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. దీనికి రుణం ఇవ్వాలని కోరారు. నెలకు 500 యూనిట్లు వాడే వినియోగదారులకు తొలుత ఈ విధానాన్ని వర్తింపజేయమని, తద్వారా వాణిజ్య విద్యుత్ ట్యాంపరింగ్‌ను అరికడతామని వివరించారు. అదే విధంగా సూపర్ వైజర్ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ విధానాన్ని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో అమలు చేస్తామని, దీనిద్వారా విద్యుత్ వాడకాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, వీటన్నింటికీ రుణం ఇవ్వాలని కోరారు. రూ. 2600 కోట్లు ప్రపంచబ్యాంక్ రుణంగా ఇస్తే, మిగిలిన రూ. 1050 కోట్లు తాము భరిస్తామని తెలిపారు. రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ షరతులన్నీ దాదాపు అంగీకరించేందుకు రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం.
రైతులకు ఉచిత విద్యుత్‌పై వేటు!
ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. రాష్ట్రంలో 15.8 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అత్యధిక విద్యుత్ సరఫరా పథకం (హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) అమలుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రెండు కన్నా ఎక్కువ వ్యవసాయ మోటార్లు లేకుండా కట్టడి చేయడం ఈ పథకం ఉద్దేశం. దీంతో పాటు 50 వేల పంపుసెట్లను ఇంధన సామర్థ్యం ఉన్న వాటితో మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీటికి మీటర్లు బిగించే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే ఉచిత విద్యుత్‌కు పరిమితి విధించే వీలుంది.
ఉచిత విద్యుత్‌కు ఇలా కత్తెరేస్తున్నాం
Published Fri, Apr 22 2016 2:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement