ఇంతింతై...బస్తీల గొంతై! | XI Metropolis World Congress to begin tomorrow at Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంతింతై...బస్తీల గొంతై!

Published Mon, Oct 6 2014 12:59 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

ఇంతింతై...బస్తీల గొంతై! - Sakshi

ఇంతింతై...బస్తీల గొంతై!

- ‘మెట్రో’ సదస్సులో ప్రసంగించే అవకాశం
- మురికివాడల సమస్యలపై గళమెత్తనున్న చిన్నోడు

బంజారాహిల్స్: ఫిలింనగర్ మురికివాడల్లోని బసవ తారక నగర్ బస్తీలో నివసిస్తున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లాలంటే రోడ్డు లేదు. మంచినీటి పైప్‌లే ఆ ఇంటికి వెళ్లే మెట్లు. ఇంటి నుంచి కిందికి వస్తే రోడ్లపై పారుతున్న మురుగునీరు... మూతలులేని మ్యాన్‌హోళ్లు... పొంగి పొర్లుతున్న డ్రైనేజీ పైపులు, కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం కనిపిస్తాయి. వారానికో మారు మంచినీటి సరఫరా, వెలగని వీధి దీపాలు, విద్యుత్ సమస్య షరా మామాలే... అలాంటి బస్తీకి చెందిన చిన్నోడికి మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది.

ఆ చిన్నోడి పేరు కొక్కెన రాజ్‌కుమార్ (13). రాజధానిలోని బస్తీలలో, మురికివాడల్లో నివసించే చిన్నారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చూసి... అక్కడి ప్రజలతో మాట్లాడి, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి... తన ప్రసంగంతో ఆకట్టుకున్న రాజ్‌కుమార్... సోమవారం నుంచి నగరంలో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సులో 1920 మంది విదేశీ ప్రతినిధుల ముందు ప్రసంగించనున్నాడు. ఈ బాలుడు స్థానికంగా ఉన్న లీడ్ గ్రామర్ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తండ్రి కె.శేఖరయ్య కూలీ కాగా, తల్లి సరోజని గృహిణి.

స్థానికంగా దివ్యదిశ, బాలరక్ష, హమారా బచ్‌పన్ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న 60 గ్రూప్‌లలో రాజ్‌కుమార్ ఓ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాజ్‌కుమార్ ప్రతిభను నిర్వాహకులు గుర్తించారు. వెంటనే నగరంలోని బస్తీలలోని చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు బస్తీ బాట పట్టించారు. తనకు అప్పగించిన పనిని రాజ్‌కుమార్ నిద్రాహారాలు మాని పూర్తి చేశాడు. తాను నివసిస్తున్న బస్తీలోనే కొకొల్లలుగా ఉన్న సమస్యలను ఏకరువు పెట్టాడు. బస్తీల్లో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ప్రజలు పడుతున్న పాట్లను ఆధారాలతో చూపించాడు.
 
ప్రపంచం దృష్టికి తీసుకువెళతా..

దేశ విదేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధుల ముందు మాట్లాడే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అంశంలో భాగంగా ‘నేల -కలుషితమౌతున్న ఖాళీ స్థలాలు’ అనే అంశంపై ప్రసంగించబోతున్నాను. ఇందు కోసం హైదరాబాద్‌లోని చాలా బస్తీలు తిరిగాను. ఎక్కడా గ్రౌండ్‌లు లేవు.   ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. పిల్లలకు ఆడుకునే అవకాశం దక్కడం లేదు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో నివసించే పిల్లల తరఫున ఆ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకువెళతా.  ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా.
 - రాజ్ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement