‘కోటి ఎకరాల’ యజ్ఞంలో యువ ఇంజనీర్లే కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహాయజ్ఞంలో యువ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ తెలంగాణ రూపురేఖలు మార్చడానికి, రైతుల కళ్లల్లో సంతోషం చూడటానికి యువ ఇంజనీర్లు కృషి చేయాలని ఆయన సూచించారు. నీటిపారుదల శాఖలో నియమితులైన 242 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ)కు శుక్రవారం మంత్రి హరీశ్ జలసౌధలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఈ దేశం నాకేమిచ్చింది.
ఈ ప్రభుత్వం నాకేం చేసింది అని కాకుండా సమాజానికి, జన్మనిచ్చిన తెలంగాణకు నేనేమి చేశాను’ అని ప్రతి ఇంజనీర్ ప్రశ్నించుకొని పని చేయాలన్నారు. సాగునీటి రంగంలో పనులన్నీ ఒక యుద్ధంలా జరుగుతున్నాయని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే గొప్ప అవకాశం యువ ఇంజనీర్లకు వచ్చిందని పేర్కొన్నారు. కరువు, వలసలు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల విముక్తికి సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ కాకతీయతో పాటు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టారని, ‘తెలంగాణ కావాలి కోటి ఎకరాల మాగాణి’ అన్న కేసీఆర్ నినాదమే అందరి నినాదం కావాలని అన్నారు.
రాష్ట్రంలో భూమి ఉన్నా సాగునీటి వసతి లేనందునే రైతులు పట్టణాలకు వల సలు వెళుతున్నారని, తెలంగాణ పల్లెల్లో ఆత్మహత్య లు కొనసాగుతున్నాయని చెప్పారు. వాటిని నివారించాలంటే ప్రతీ ఎకరానికి సాగునీరు అందాలని, దానికి యువ ఇంజనీర్లు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ముందుందని, వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగా లు కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఇతర అధికారులు పాల్గొన్నారు.