
దళితులనూ దగా చేశారు
* సర్కారుపై విపక్ష నేత మండిపాటు
* దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వాకౌట్
సాక్షి, హైదరాబాద్: దళితులకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా చివరకు వారినీ మోసం చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవా రం ప్రశ్నోత్తరాల సమయంలో సాంఘిక సంక్షేమశాఖకు నిధుల కేటాయింపు, వ్యయంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘మంత్రి చెప్పేవి పూర్తిగా సత్య దూరమైనవి. ఒకవైపు కేటాయింపులు చేయడం లేదు. ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఆయన శాఖ రాసిన లేఖ నే ఆధారంగా చూపిస్తున్నాం.
అయినా బుల్‌డోజ్ చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు..’ అని మండిపడ్డారు. ‘2014-15లో సాంఘిక సంక్షేమశాఖకు రూ.2,673 కోట్లు కేటాయిస్తే అందు లో రూ.1,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.,1000 కోట్లకు పైగా నిధులకు పంగనామాలు పెట్టారు. 2015-16కు రూ. 2,124 కోట్లు కేటాయిస్తే రూ.1,090 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రూ.1,100 కోట్లకు పంగనామాలు పెట్టారు..’ అని దుయ్యబట్టారు. ‘బడ్జెట్‌లో వాళ్ల జనాభా ప్రకారం వాళ్లకి నిధులు కేటాయించడం చట్టపరంగా వారికి కల్పించిన హక్కు. కానీ ఈ కేటాయింపులు, వ్యయాలు చూస్తే దళితులను ఎంతగా మోసం చేశారో అర్థమవుతోంది.
చివరకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా దారి మళ్లించి ఆ డబ్బులతో సిమెంట్ రోడ్ల వేస్తామని చెబుతుండటం దారుణం..’ అని విపక్ష నేత మండిపడ్డారు. ‘ఉపాధి హామీ పథకం అనేది నిరుపేదల కడుపు నింపే కార్యక్రమం. 100 రోజులు కూలీ ఇచ్చినప్పుడే ఆ పేదవాడు బతకగలుగుతాడు. అటువంటిది... పథకాన్ని నీరుగారుస్తూ.. కూలీలకు దక్కాల్సిన డబ్బులను కూడా వారికి ఇవ్వకుండా తగ్గించి, దాంట్లో నుంచి సిమెంట్ రోడ్లు వేస్తామంటే.. ఇంతకంటే దారుణమైన విషయం ఉందా? సిమెంట్ రోడ్లు వేయవద్దని ఎవరూ అనడం లేదు. వాటికి వేరే డబ్బులు కేటాయించండి..’ జగన్ అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ పార్టీ సభ్యులతో కలసి సభ నుంచి బయటకు వెళ్లారు.
మాల, మాదిగ పల్లెలంటే సర్కారుకు చులకన: కొరుముట్ల
రాష్ట్రంలో మాల, మాదిగ పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని వైఎస్సార్‌సీపీ సభ్యుడు కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. తాగునీరు లేదు, రోడ్లు లేవు. కరెంటు సరిగ్గా ఉండదని, మాల, మాదిగ పల్లెలంటేనే ప్రభుత్వానికి చులకన భావమని విమర్శించారు. పైగా జన్మభూమి కమిటీలను వేసి ఎస్సీ, ఎస్టీలకు రుణాలు అందకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చే ప్రతిపాదన ఏదైనా ఉందా? అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం నుంచి నిధులు రాలేదు: రావెల
సాంఘిక సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపు, వ్యయంపై ఆ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లే ఖర్చు చేయలేకపోయామన్నారు. స్కాలర్‌షిప్పులు ఏ నెలకానెల ఇచ్చే పద్ధతి తెచ్చాం కాబట్టి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు.