
పార్టీ కండువాలు ఎలా కప్పుతారు?
సాక్షి, హైదరాబాద్: సభాపతిననే విషయాన్ని మర్చిపోయి కోడెల శివప్రసాదరావు అధికారపార్టీ ఎమ్మెల్యేలాగా టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని, ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరే వారికి పార్టీ కండువాలు కప్పుతున్నారని వైఎస్సార్‌సీపీ సభ్యుడు, నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ స్పీకరుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని.. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టామని తెలిపారు. స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. కోడెల వ్యవహార శైలిని నిశితంగా విమర్శించారు.
‘‘ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుల్ని కిడ్నాప్ చేయడమేగాక ఎమ్మెల్యే ముస్తఫాను గాయపరిచారు. దీనివెనుక కారకులెవరో అందరికీ తెలుసు. ప్రజాపంపిణీకి చెందిన పది టన్నుల బి య్యాన్ని నేను గోడౌన్‌లో పట్టించాను. ఈ వ్యవహా రంలో శివప్రసాద్ కుమారుడిదే ముఖ్యభూమిక. స్పీ కర్ కుర్చీని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారు’’ అని ఆరోపించారు. కోడెల డాక్టర్‌గా ప్రజాసేవ చేస్తున్న గొప్ప వ్యక్తని, ఆయనపై ఆరోపణలు చేయడం అన్యాయమని మంత్రి ప్రత్తిపాటి అనడంతో.. ‘‘నేనూ డాక్టర్ వృత్తిలోనే ఉన్నాను. గుంటూరు జిల్లా వాసులందరికీ ఈ విషయం తెలుసు. స్పీకర్ అధికార దుర్వినియోగంతో నాపై కేసు పెట్టించి అరెస్టు చేయించారు.
నేను చెప్పిన విషయాల్లో తప్పుం టే రాజీనామా చేస్తా.. ఈ విషయమై నేను సవాల్ చేస్తున్నా.. స్పీకర్ అండదండలు, అధికారంతో కోడెల కుటుంబీకులు సాగిస్తున్న అక్రమాలపై విచారణ జరిపించాలి..’’ అని డిమాండ్ చేశారు. కోడెల ఇంట్లో బాంబులు పేలిన కేసులో ఆయనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని మంత్రులు పల్లె, ప్రత్తిపాటి చెప్పినదాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతించనందున ప్రాసిక్యూట్ చేయలేదని, సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వలేదని చెప్పారు.