ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొసీడింగ్ సీడీలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొసీడింగ్ సీడీలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. స్పీకర్ నియమించిన కమిటీకి ఏ అంశాలపై చర్చించాలో ఇప్పటివరకూ నియమ నిబంధనలు ఇవ్వలేదన్నారు. తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఇంకా స్పష్టమైన జవాబు రాలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
డిసెంబర్ 22 నాటి జీరో అవర్ అంశాలపై మాత్రమే కమిటీ వేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. తమ అభ్యంతరాలన్నింటిపై చర్చ జరగాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ విజువల్స్ మీడియాకు ఎలా వచ్చాయో చెప్పాలని, మీడియాకు విజువల్స్ ఇచ్చినవారిని శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. అధికార పార్టీ నేతలు సభలో ఏం మాట్లాడాలో కొందరు రాసి ఇస్తున్నారని, తాము మాట్లాడిన వీడియోలు వారికి ఇచ్చారని, అయితే సభలో వారు రెచ్చగొట్టిన వీడియోలు మాత్రం బయటకు వెల్లడించలేదన్నారు.