'చంద్రబాబు టూరిస్ట్ సీఎంగా మారారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ....ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మంగళవారం నుంచి చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని అంబటి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఢిల్లీలో మరోసారి ఉద్యమిస్తామన్నారు. మాకు మద్దతుగా టీడీపీ ఎంపీలను పంపుతారా అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. బాబును కేంద్రప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని..అయినా కేంద్రంతో పోరాడే దమ్ము ఆయనకు లేదని చెప్పారు. బాబు వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు. సీఎం చంద్రబాబు అవినీతిపై ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. బాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరుపుతుందని భయపడుతున్నారని అంబటి చెప్పారు.