హోదా కోసం బాబు పోరాడలేరు | Ambati rambabu comments on chandhrababu | Sakshi
Sakshi News home page

హోదా కోసం బాబు పోరాడలేరు

Published Mon, May 9 2016 3:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా కోసం బాబు పోరాడలేరు - Sakshi

హోదా కోసం బాబు పోరాడలేరు

♦ ఆయన నిర్వీర్యమైపోయిన ముఖ్యమంత్రి
♦ వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం
 
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లోనూ, ఓటుకు కోట్లు వ్యవహారంలోనూ పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పరిస్థితిలో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓ నిర్వీర్యమైన సీఎంగా మిగిలిపోయారని విమర్శించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో రాంబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడే విషయంలో కడప, కర్నూలు జిల్లా పర్యటనల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై  తీవ్రంగా మండిపడ్డారు.

అనుభవజ్ఞుడునని చెప్పుకొనే చంద్రబాబు.. టీడీపీ వారు కేంద్ర మంత్రి పదవులు వదిలేదిలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రంతో సయోధ్యగా ఉంటూనే అన్నీ సాధించుకోవాలని బాబు ఇప్పటికీ చెబుతున్నారని, మరి గత రెండేళ్ల నుంచీ సామరస్యంగా ఉండి సాధించిందేమిటి? ప్రత్యేక హోదా తెచ్చారా? చాలినన్ని నిధులు తేగలిగారా? రెవెన్యూలోటు భర్తీ చేసుకోగలిగారా? లేక రైల్వే జోన్‌ను సాధించారా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఏమీ సాధించలేకపోయినా ప్రతిపక్షాన్ని మాత్రం విమర్శించడం చంద్రబాబు చేతగాని తనానికి నిదర్శనమన్నారు.  

 ఢిల్లీలో పోరాడతాం.. మద్దతిస్తారా?
 తాను పోరాడక పోగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తూ ఉంటే ‘పోరాడాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీ వెళ్లి పోరాటం చేయండి... ప్రత్యేక హోదా సాధించండి’ అంటూ చంద్రబాబు ఎద్దేవాగా మాట్లాడటంపై అంబటి మండిపడ్డారు. హోదా కోసం తొలి నుంచీ పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని, వైఎస్ జగన్ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసిన విషయం మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. తాము ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని, తమ పోరాటానికి టీడీపీ ఎంపీల మద్దతునిప్పించే ధైర్యం చంద్రబాబుకు ఉందా?అని అంబటి ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పనులు, పట్టిసీమతో పాటు అనేక ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి జరిగిందని కేంద్రానికి తెలుసునని అందుకే చంద్రబాబు తనపై సీబీఐ విచారణ జరక్కుండా చేసుకునేందుకు ప్రత్యేక హోదాపై గానీ, నిధుల విషయంలో గానీ గట్టిగా అడుగలేకపోతున్నారని రాంబాబు చెప్పారు. తెలంగాణలో ఓటుకు కోట్లు విషయంలో దొరికి పోయిన చంద్రబాబు.. ఆ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులపై మాట్లాడలేకుండా ఉన్నారన్నారు.

 ఏం పని ఇది కలెక్టర్ గారూ...
 ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరే సభా వేదిక ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించడం కర్నూలు జిల్లా కలెక్టర్‌కు తగదని అంబటి చెప్పారు. పోస్టింగ్‌ల కోసం ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇంత దిగజారితే ఎలా అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement