లెక్కలు తేల్చాల్సిందే
మైనారిటీలకు కేటాయింపుల లెక్కల్లో తేడాలు
వైఎఎస్ఆర్‌సీపీ సభ్యుల తీవ్ర నిరసన
పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు
స్పీకర్ వైఖరి నశించాలంటూ నినాదాలు
హైదరాబాద్
మైనారిటీల వ్యవహారంపై మంత్రి చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వివరించబోతుండగా మధ్యలోనే ఆపినందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. స్పీకర్ వైఖరి నశించాలంటూ నినదించారు. మైనారిటీలకు కేటాయించిన నిధుల లెక్కలు తేల్చాలని పట్టుబట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకే ఇలా చేస్తోందని, లెక్కలు చూపించడం లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మైకులు కట్ చేయడం ఏంటని, చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వరని అడుగుతూ పోడియం వద్ద బైఠాయించారు. తొలుత మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రన్న రంజాన్ కానుక పేరుతో ఒకసారి, రంజాన్ కానుక పేరుతో మరోసారి వారికి సాయం అందిస్తున్నామని మంత్రి రఘునాథరెడ్డి చెప్పారు. దీనికి కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా అభ్యంతరం తెలిపారు. మంత్రి చెబుతున్నది చూస్తుంటే మైనారిటీలకు ప్రభుత్వం చాలా చేసేస్తోందని అనిపిస్తుందని, కానీ అవన్నీ అవాస్తవాలని అన్నారు. మైనారిటీల కోసం అదనంగా నిధులు ఖర్చు చేశామంటున్నారు గానీ, అదంతా తప్పేనన్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో రూ. 246 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 2015-16 బడ్జెట్‌లో రూ. 376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించారని, కానీ బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మైనారిటీ హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఇలా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చుపెట్టినట్లు చెప్పడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన లేదని అన్నారు.
అయితే చాంద్ బాషా ఇలా వివరిస్తుండగానే.. స్పీకర్ కలగజేసుకుని, సబ్జెక్టుల వారీగా వివరంగా అక్కర్లేదని, తక్కువగా ఖర్చు పెట్టారని చెబితే సరిపోతుందని అన్నారు. అయితే గతంలో ఒకో ప్రశ్నకు 20-40 నిమిషాలు కూడా కేటాయించేవారని, ఇప్పుడు మైనారిటీలకు సంబంధించిన అంశానికి కనీసం 5 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగని చాంద్ బాషా అడిగారు. కనీసం అనుబంధ ప్రశ్నకు అయినా అవకాశం ఇవ్వపోతే ఎలాగని అన్నారు. అయినా స్పీకర్ మాత్రం మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సమాధానం ఇవ్వాలని చెప్పారు. దాంతో ఆయన సమాధానం ఇస్తుండగానే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా లేచి నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత, టీ విరామం కోసం అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు.