బడ్జెట్ అంతా కాకి లెక్కలేనా? | ysrcp mla rajendranath reddy slams budget figures of ap | Sakshi
Sakshi News home page

బడ్జెట్ అంతా కాకి లెక్కలేనా?

Published Thu, Mar 17 2016 1:27 PM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM

బడ్జెట్ అంతా కాకి లెక్కలేనా? - Sakshi

బడ్జెట్ అంతా కాకి లెక్కలేనా?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా కాకిలెక్కల్లానే ఉందన్న విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంగా చూపించారు. అంకెల్లో ఏమాత్రం పొంతన లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎలా ప్రవేశపెట్టారో.. అందులో అంశాలు ఎలా ఉన్నాయో అంతా సమగ్రంగా వివరించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్‌, తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారిల ప్రసంగాలను ఆయన ప్రస్తావించారు. రాజకీయం, ప్రజాసేవ రెండూ వేర్వేరు కావన్న సిద్ధాంతాలు కలిగిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున బడ్జెట్ మీద చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత ముఖ్యమైన సమయంలో ఆర్థికమంత్రి లేకపోవడం గమనార్హమని ఎత్తిచూపారు.

బడ్జెట్‌లో బెంచిమార్కు ఉంటుందని, అక్కడి నుంచి మొదలుపెట్టుకోవాలని అన్నారు. తమకు బడ్జెట్ వివరాలను కొంత ట్యాబ్‌లోను, మరికొంత పెన్ డ్రైవ్‌లోను ఇచ్చారని గుర్తు చేశారు. బడ్జెట్ అంటే అన్నీ అంచనాలేనని, అయితే అయిపోయిన అంశాలకు సంబంధించి కూడా సరైన వివరణ లేదని చెప్పారు. 2015-16 ఖర్చులు 32,688 కోట్లు గానీ, రెవెన్యూ ఖర్చు మాత్రం 54 వేల కోట్లు అన్నారని.. ఏంటా అని చూస్తే మిగిలిన 22 వేల కోట్లు పబ్లిక్ డిపాజిట్లు అన్నారని తెలిపారు. దీనికి ఎఫ్ఆర్‌బీఎం అనుమతులు తీసుకున్నామా లేదా అనే విషయం చూడాలని అన్నారు. అలాగే, రాబడి 90 వేల కోట్లు అన్నారు, అందులో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 21,779 కోట్లు ఉందని చెప్పారు. రెవెన్యూ ఖర్చు 1.14 లక్షల కోట్లుగా చెప్పడంతో.. రెవెన్యూలోటు భారీగా 24,314 కోట్లుగా ఉందని అన్నారు. అలాగే కేపిటల్ వ్యయం 11,409 కోట్లు ఉన్నట్లు చెప్పారు. మొత్తమ్మీద 35వేల కోట్ల లోటు కనిపిస్తోందని, ఇది జీఎస్‌డీపీలో 7 శాతం వరకు ఉంటోందని అన్నారు. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం మాత్రం ఇది 3 శాతానికి మించకూడదని చెబుతోందని.. అలాంటప్పుడు ముందుగా అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. పబ్లిక్ డిపాజిట్లు 22 వేల కోట్లు ఎప్పుడు, ఎందుకు వాడారు, దానికి అనుమతులు తీసుకున్నారా అనేది చూడాలని తెలిపారు.

ఆర్థికమంత్రి చెప్పిన మరో అబద్ధాన్ని కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఎత్తి చూపించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో తాము మొత్తం 99 శాతం విజయవంతంగా ఖర్చు పెట్టామన్నారని అన్నారు. కానీ మొత్తం బడ్జెట్ 1.18 లక్షల కోట్లు అయితే.. మొత్తం ఖర్చు 70వేల కోట్లుగా చూపించారని, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇంకా 38వేల కోట్లు ఇంకా ఖర్చుపెట్టాల్సి ఉందని.. మరి ఆర్థికమంత్రి చెప్పినది వాస్తవమేనా, కేవలం అంకెలు మాత్రమే ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement