
ఆఫ్రికా దేశాలకు భారీగా ఆ.. కండోమ్స్..
తాజాగా 1.3 మిలియన్ల ఫిమేల్ కండోమ్ లను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసినట్లు హెచ్ ఎల్ ఎల్ సంస్థ తెలిపింది.
తిరువనంతపురంః ప్రపంచ దేశాల్లో ఇప్పుడు 'ఫిమేల్ కండోమ్స్' కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రధాన కండోమ్ ఉత్పత్తిదారులు 'హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్' లిమిటెడ్ తాజాగా 1.3 మిలియన్ల ఫిమేల్ కండోమ్ లను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ లోని కార్యాలయం నుంచీ ఆఫ్రికాలోని గాంబియా, బర్కినా ఫాసో, కారిబ్బీన్ లోని డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు 1.3 మిలియన్ల ఫిమేల్ కండోమ్ లు ఎగుమతి చేసినట్లు హెచ్ ఎల్ ఎల్ సంస్థ తెలిపింది. హెఐవీ/ఎయిడ్స్ మహమ్మారితో పాటు, లైంగికంగా వ్యాపించే వ్యాధులను నివారించడంలో భాగంగా ఆయా దేశాలు తమ సంస్థకు ఈ కొత్త ఆర్డర్ ను ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ ఉత్పత్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హెచ్ ఎల్ ఎల్ ఫిమేల్ కండోమ్ లను.. ఆమ్ స్టర్ డామ్ ప్రధాన కార్యాలయం ఐడిఏ ఫౌండేషన్ సహాయంతో అందిస్తోంది. ఐడీఏ గ్లోబల్ ఫండ్ ప్రాజెక్ట్ లో భాగంగా హెల్ ఎల్ ఎల్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేని నాణ్యమైన, అవసరమైన మందులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్తోంది. సహజమైన రబ్బరు పాలు, స్వదేశీ పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చేస్తున్న ఈ ఫిమేల్ కండోమ్స్ ను కంపెనీ.. తమ కొచ్చి కర్మాగారంలో సంవత్సరానికి 25 మిలియన్ల వరకూ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సంవత్సరం మార్చి నెలలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అర్హత పొందిన తర్వాత ఫిమేల్ కండోమ్స్ కు తాము అందుకున్న మొదటి విదేశీ ఆర్డర్ ఇదేనని సంస్థ వెల్లడించింది. ఇకపై మరిన్ని ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నట్లు హెచ్ ఎల్ ఎల్ సీఎండీ ఆర్పీ ఖండేల్వాల్ తెలిపారు. 'హెచ్ ఎల్ ఎల్ ఫిమేల్ కండోమ్' కు ఐదేళ్ళ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని.. అందుకు యూరోపియన్ యూనియన్, సౌత్ ఆఫ్రికా దేశాల ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.