
పడవ మునిగి..10మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు జర్మన్ జాతీయులతో సహా మొత్తం పది మంది చనిపోయారు. ఉత్తర బోర్నియో ద్వీపంలోని తారకన్ నుంచి 51 మందితో ఓపడవ తాన్‌జుంగ్‌సెలార్ వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించిన పది నిమిషాల్లోనే పడవను బలమైన అల తాకటంతో బోల్తా పడింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి 23మందిని రక్షించగలిగారు.
అలాగే, రెండేళ్ల చిన్నారి సహా ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఇద్దరు జర్మన్లు. మిగతా వారి జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇండోనేషియాలో మొత్తం 17వేల వరకు దీవులున్నాయి. అక్కడి ప్రజల రవాణాకు పడవలపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తరచూ పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఆరంభంలో తిడుంగ్ దీవిలో జరిగిన పడవ ప్రమాదంలో 23 మంది చనిపోయారు.