మూడు గంటల్లో 85 కోట్లు మాయం
టోక్యో: జపాన్ లో అంతర్జాతీయ నేరగాళ్ల భారీ చోరి ఉదంతం అక్కడి అధికారులకు చెమటలు పట్టించింది. నకీలీ ఏటీఎం కార్డులను ఉపయోగించి కోట్ల రూపాయల సొమ్మును క్షణాల్లో కాజేశారు. రాజధాని నగరం టోక్యో సహా మరో 16 ప్రధాన జిల్లాల్లోని ఏటీఎం లను లూఠీ చేసిన దొంగలు సుమారు 85కోట్ల 60 (12.7 మిలియన్ డాలర్ల) లక్షలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం 5 గంటలకు మొదలైన ఈ దందా ఎనిమిదిగంటల కల్లా అంటే కేవలం మూడే మూడుగంటల్లో తమ ప్లాన్ అమలు చేశారు. మే 15 ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది.
దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఖాతాల వివరాలను తస్కరించి 1600 నకిలీ క్రెడిట్ కార్డులతో ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసిన దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఒకే రోజున ఇంత భారీ ఎత్తున దొంగతనం జరగడం అక్కడి అధికారుల్లో అలజడి రేపింది. అంతర్జాతీయ నేరస్థులు సుమారు 100 మంది ఈ చోరీలో పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. నేరానికి పాల్పడిన అనంతరం వీరు దేశం నుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై జపాన్ ఇంటర్ పోల్ విచారణ చేపట్టింది. మరోవైపు ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టాలని సౌత్ ఆఫ్రికా అధికారులను కోరింది. ఖాతాల వివరాలు, కార్డులు దొంగలకు ఎలా చేరాయో దర్యాప్తు చేయాలని కోరింది.