ట్యునీషియాలో ఎమర్జెన్సీ..
- రాజధాని నడిబొడ్డున బస్సు పేలుడు.. ఉగ్రదాడిగా అనుమానం
- దేశాధ్యక్షుడి దక్షణ దళానికి చెందిన 15 మంది అంగరక్షకుల దుర్మరణం
- నెలరోజుల అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు బెంజీ ఎసెప్సీ
ట్యునిష్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా రాజధాని ట్యూనిష్ నగరం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అధ్యక్షుడి కాన్వాయ్ కి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు పేల్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళావారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనలో 15 మంది సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పేలుడు సమయంలో అధ్యక్షుడు అక్కడ లేకపోవటంతో పెను ముప్పు తప్పినట్లయింది.
రాజధాని నగరం నడిబొడ్డులో జరిగిన పేలుడుతో ఉలిక్కిపడ్డ ట్యునీషియా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ వెల్లడించారు. కాగా, దాడికి పాల్పడింది ఉగ్రవాదులే అయిఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి లక్ష్యం అధ్యక్షుడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ తర్వాత అత్యయిక పరిస్థితి ప్రకటించిన దేశం ట్యునీషియానే కావటం గమనార్హం.