ట్యునిస్ (ట్యునిషియా): ట్యునిషియా రాజధాని ట్యునిస్ సమీపంలో ట్రక్కు, రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 70 మంది గాయాలపాలయ్యారు. స్థానిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు రైలును ఢీకొట్టడంతో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని చెప్పారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడని స్థానిక మీడియా తెలిపింది.
మృతుల్లో ఎక్కువ మంది రైలు ప్రయాణికులేనని రవాణా అధికారులు వెల్లడించారు. రాజధాని ట్యునిస్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాఫోర్ పట్టణం నుంచి బయలుదేరిన రైలు 60 కి.మీ ప్రయాణించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. రైలు, ట్రక్కు డ్రైవర్లు ఇద్దరూ అధిక వేగంతో వాహనాలను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.