వారంతా 20 నుంచి 40 ఏళ్ల వసయున్న మహిళలు. కాస్త ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ నిరక్షరాస్యులు.
కాఠ్మండు: వారంతా 20 నుంచి 40 ఏళ్ల వయసున్నవారే. కాస్త ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ నిరక్షరాస్యులు. ఊర్లో పని దొరకడం కష్టం. అలాంటి వాళ్ల అసహాయ స్థితిని సొమ్ము చేసుకుని కొందరు వ్యక్తులు ఏకంగా 27 మంది మహిళలను దుబాయ్ కి అక్రమ రవాణా చేయబోయి అడ్డంగా దొరికిపోయారు. ఆ మహిళలంతా బుధవారం తమ తమ ఇళ్లకు క్షేమంగా చేరారు. వివరాల్లోకి వెళితే..
నేపాల్ లోని పలు ప్రాంతాలకు చెందిన 27 మంది మహిళలకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు ఇద్దరు బ్రోకర్లు. ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కుర్దీస్థాన్, కెన్యా దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని.. మంగళవారం వారిని బయలుదేరదీశారు. కఠ్మాండు మీదుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న తరువాత.. ఆఫ్రికా కాకుండా దుబాయికి వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇంతమంది మహిళలు.. ఇద్దరు మగవాళ్లు బృందంగా కనిపించడం, వారి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
భారత విదేశాంగ శాఖతోపాటు నేపాల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రంగంలోకి దిగి మహిళల వివరాలు సేకరించారు. బుధవారం మధ్యాహ్నం వారందరినీ కఠ్మాండు ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి వారివారి నివాసాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి బిష్ణు తమాంగ్ (29), నుపానే (32) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.