అహ్మదాబాద్ లో యోగాను అభ్యసిస్తున్న విద్యార్థినులు
192 దేశాల్లో 200 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం
న్యూయార్క్: మొత్తం 192 దేశాల్లో 200 కోట్ల మంది ప్రజలను భాగస్తులను చేస్తూ ఐక్యరాజ్యసమితి(ఐరాస) జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం పలు దేశాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పలు దేశాల్లో భారత రాయబారుల నేతృత్వంలో యోగా దినోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌తో పాటు, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లు పాల్గొంటారు.
ఇందులో 30వేల మంది యోగా చేస్తారని ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎత్తై యుద్ధభూమి సియాచిన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించటానికి భారత ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.
యోగాపై ముస్లింల పుస్తకం
యోగాపై ముస్లింలలో అపోహలు తొలగించటానికి ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ‘యోగా అండ్ ఇస్లాం’ పేరుతో ప్రచురించిన 32 పేజీల ఈ బుక్‌లెట్‌ను కేంద్ర శ్రీపాదనాయక్ బుధవారం విడుదల చేశారు.