ఆ పసికూన.. పిడుగే!
లండన్: కేవలం నాలుగేళ్ల పసిప్రాయంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో సరితూగగల మేధస్సును సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు లండన్‌లోని ఓ పసి పిడుగు!!. ఇంత పిన్న వయసులోనే 190 పుస్తకాలను ఔపోసన పట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. లండన్‌లోని దక్షిణ యార్క్‌షైర్‌లో ఉన్న బాన్‌స్లే ప్రాంతానికి చెందిన షెర్విన్ సరాబి వయసు కేవలం నాలుగేళ్లు. ఇంత చిన్న వయసుకే ఆ బాలుడు 160 పాయింట్ల మేధాశక్తిని సొంతం చేసుకున్నాడు. ఇది ఐన్‌స్టీన్ సహా బిల్‌గేట్స్, స్టీఫెన్ హాకింగ్‌ల మేధాశక్తికి సరిసమానమని నిర్వాహకులు వెల్లడించారు. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ పీటర్ కాంగ్‌డన్ మాట్లాడుతూ, షెర్విన్ మేధాశక్తి అపూర్వం, నమ్మశక్యం కానిది, బాగా ఎదిగిన పిల్లల్లాగా మాట్లాడుతున్నాడు, సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంది అన్నా రు. సాధారణంగా నాలుగేళ్ల చిన్నారులు పాఠశాల ముఖం చూసివుండరు. అయితే, షెర్విన్ మాత్రం ఈ వయసుకే రాస్ట్రిక్ ఇండిపెండెంట్ స్కూల్‌లో చేరి 8, 9 తరగతుల విద్యార్థుల స్థాయిని అందుకున్నాడన్నారు. షెర్విన్ మానసిక వయసును 8 ఏళ్ల 9 మాసాలుగా నిర్ధారించినట్టు చెప్పారు. ప్రస్తుతం గిన్నిస్ క్లబ్ మెంబర్‌గా కూడా ఉన్న షెర్విన్ ఇప్పటికి 190 పుస్తకాలు చదివినట్టు బాలుడి తల్లి అమందా తెలిపారు. 10 నెలల బిడ్డగా ఉన్నప్పుడే చిన్నచిన్న పదాలు పలకడం ప్రారంభించాడన్నారు.