నేరస్తుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నాటి భారీ నిరసన ర్యాలీ (ఫైల్)
హాంకాంగ్: చైనా వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన 53 మంది పౌరులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఒక్కచోట చేరినందుకు 36 మంది పురుషులు, 17 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను అతిక్రమించిన నేరానికి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన బిల్లుపై ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గతేడాది హాంకాంగ్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో హక్కుల కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.(హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. ట్రంప్ కీలక నిర్ణయం!)
ఈ ఘటన జరిగి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా మరోసారి వారంతా రోడ్ల మీదకు వచ్చి చైనా తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసే విధంగా ఉన్న చైనా జాతీయ భద్రతా చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రోడ్ల మీదకు రాగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్ల దిగ్భంధనం చేసిన నిరసనకారులను చెదరగొట్టేందుకు వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమైన తరుణంలో.. ‘‘చట్టబద్ధంగా చేసే నిరసనలకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ చట్టవ్యతిరేక చర్యలను ఉపేక్షించం. దయచేసి చట్టాన్ని అత్రిమించడం మానుకోండి’’ అంటూ ట్విటర్ వేదికగా పౌరులకు విజ్ఞప్తి చేశారు. (వివాదాస్పద బిల్లుకు హాంకాంగ్ ఆమోదం)
ఆనాటి నేరస్తుల అప్పగింత బిల్లులో ఏముంది?
వివాదాస్పద నేరస్తుల అప్పగింత బిల్లుకు ఆమోదం లభిస్తే.. నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. కాగా 1997లో బ్రిటన్ నుంచి హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక.. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానం’’ కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. ఈ క్రమంలో హాంకాంగ్‌కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. అయితే డ్రాగన్‌తో మాత్రం ఈ ఒప్పందం లేదు.
ఈ క్రమంలో చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్‌లో తన ప్రేయసిని హత్య చేసి తిరిగి హాంకాంగ్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. అయితే ప్రజాస్వామ్య వాదుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు హాంకాంగ్ స్వయంప్రతిపత్తి రద్దయ్యేలా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేయనున్న నేపథ్యంలో మరోసారి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment